ట్రాఫిక్ సమస్యకు గూగుల్ చెక్!

15 Apr, 2016 15:32 IST|Sakshi
ట్రాఫిక్ సమస్యకు గూగుల్ చెక్!

గూగుల్ అందిస్తున్న కొత్త సదుపాయంతో ఇకపై ట్రాఫిక్ లో ఇరుక్కుపోవాల్సిన పని ఉండదట. ఇప్పిటికే తాము చేరాల్సిన అడ్రస్ కనుక్కోవడం, దూరాన్ని తెలుసుకోవడం, రూట్లు వెతుక్కోవడంలో యూజర్లకు సహకరిస్తున్న గూగుల్ మ్యాప్స్... ఇప్పుడు కొత్తగా ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించే మరో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.

గూగుల్ మ్యాప్స్ మీకు కొత్త కొత్త మార్గాల్లో ప్రయాణించే అదృష్టాన్ని కల్పిస్తోందని గూగుల్ ప్రొడక్ట్ మేనేజర్ సంకేత్ గుప్తా గూగుల్ మ్యాప్స్ బ్లాగ్ స్పాట్ లో వెల్లడించారు. ఈ కొత్త అవకాశంతో.. ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోకుండా వేరే మార్గాల్లో సులభంగా గమ్యాన్ని చేరుకోవచ్చని, వెళ్లే మార్గంలో ట్రాఫిక్ జామ్ అయితే మ్యాప్స్‌లో అలర్ట్ వస్తుందని చెప్పారు. ఇందుకోసం యాప్ లో మనం ఎక్కడికెళ్లాలో టైప్ చేస్తే చాలు.. దారిలో ఉండే ట్రాఫిక్ ను బట్టి  ఎప్పటికప్పుడు అలర్ట్స్ వస్తుంటాయని, దాన్నిబట్టి త్వరగా వెళ్లగలిగే రూటును ఎంచుకునే అవకాశం ఉంటుందని సంకేత్ తెలిపారు. ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయినపుడు మీరు ఇంకెంత సమయం వేచి చూడాల్సి వస్తుందో తెలుపుతుందని, అలాగే ప్రత్యామ్నాయ మార్గాలను తెలుసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

యూజర్లు తమ యాండ్రాయిడ్ లేదా ఐవోఎస్ పరికరాలను నేవిగేషన్ మోడ్‌లో పెట్టుకుని ఉంటే చాలని, తమకు కావాల్సిన అన్ని అప్ డేట్లను గూగుల్ మ్యాప్స్ అందిస్తుందని అంటున్నారు. ఇప్పటికే 'శ్రీలంక స్ట్రీట్ వ్యూ ఇమేజరీ' ని మ్యాప్స్ లో  అందుబాటులోకి తెచ్చినట్లు ఇటీవలే గూగుల్ వెల్లడించింది. దీనిద్వారా శ్రీలంక వాసులేకాక, ప్రపంచంలోని ప్రజలంతా శ్రీలంకను తమ ఫోన్లు, టాబ్లెట్లు, కంప్యూటర్లలో వీక్షించే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు