గుడ్డిగా యాప్స్ వాడితే అంతే సంగతి..!

25 Jan, 2018 17:47 IST|Sakshi
సరసులోకి దూసుకెళ్లిన వాహనం (ఫైల్ ఫొటో)

వాషింగ్టన్: ప్రస్తుతం ఎక్కువగా టెక్నాలజీ మీదే ఆధారపడి పనులు లాగించేస్తున్నారు. అయితే కొన్నిసార్లు అది మన ప్రాణాల మీదకి తెస్తుందనడానికి అమెరికాలో ఇటీవల ఓ ప్రమాదం ఘటన నిదర్శనమని చెప్పవచ్చు. అసలేమైందంటే.. ఓ వ్యక్తి వద్ద ఇద్దరు మిత్రులు కారు అద్దెకు తీసుకున్నారు. ఈశాన్యరాష్ట్రం వెర్మాంట్‌ లోని బర్లింగ్‌టన్‌ నగరంలో ఎస్‌యూవీ కారును ఈ వ్యక్తుల డ్రైవర్ నడుపుతున్నాడు.

ఆ డ్రైవర్ ట్రాఫిక్ తగ్గుతుందని భావించి తరచుగా జీపీఎస్ మ్యాప్ ఫాలో అయ్యేవాడు. అందులో భాగంగానే తన మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్న వేజ్ యాప్ (Waze app)ను వాడాడు. ఈ క్రమంలో ఓ ప్రదేశానికి రాగానే ట్రాఫిక్ ఎక్కువగా ఉందని, రద్దీ తక్కువగా ఉండే రూట్ కోసం వేజ్ యాప్‌లో జీపీఎస్ మ్యాప్‌ను ఫాలో అవుతూ కాస్త ముందుకు నడపగానే మంచుతో గడ్డకట్టి ఉన్న చిన్న సరసులోకి కారు రయ్‌మంటూ దూసుకెళ్లింది. భయబ్రాంతులకు లోనవడం కారులోని వారి వంతయింది. మంచుగడ్డలు చూపిన నరకం కన్నా యాప్ చూపిన నరకమే ఆ ముగ్గురు బాధితుల్ని తెగ ఇబ్బంది పెట్టిందని పోలీసులు తెలిపారు. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగలేదని, స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

కారు ప్రమాదం విషయం తెలియగానే యజమాని టారా గుర్టిన్ షాకయ్యారు. కారులోని వ్యక్తులు ప్రాణాలతో బయటపడ్డారని తెలియగానే ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం ఎస్‌యూవీ జీపును నీటి మడుగు నుంచి బయటకు తీసినట్లు చెప్పారు.

గూగుల్ అధికార ప్రతినిధి జూలీ మోస్లర్ ఈ ఘటనపై స్పందిస్తూ.. వేజ్ యాప్‌లో ఇప్పటికే కొన్ని లక్షలసార్లు మార్పులు చేశాం. నిత్యం రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుందనేది రోజూ అప్‌డేట్ చేస్తుంటాం. డ్రైవర్లు యాప్‌తో పాటు రోడ్డుపై ఓ కన్నేసి ఉంచి వాహనాలు నడిపితే కొన్ని ప్రమాదాలను అరికట్టవచ్చునని అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు