చైనా జాతీయ గీతాన్ని అవమానిస్తే జైలే!

5 Jun, 2020 08:39 IST|Sakshi

హాంకాంగ్‌: చైనా జాతీయ గీతాన్ని అవమానించడం చట్ట విరుద్ధం, శిక్షార్హమని తేల్చే వివాదాస్పద బిల్లుకు గురువారం హాంకాంగ్‌ చట్టసభ ఆమోదం తెలిపింది. ఓటింగ్‌ సందర్భంగా ప్రజాస్వామ్య అనుకూల సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. దాంతో బిల్లుకు అనుకూలంగా 41 మంది ఓటేయగా, ఒక్కరు మాత్రమే వ్యతిరేకించారు. హాంకాంగ్‌ పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛకు, చైనాతో పోలిస్తే తమ పౌరులకు అధికంగా ఉన్న ఇతర హక్కులకు ఈ బిల్లు విఘాతమని ప్రజాస్వామ్య అనుకూలురు వాదిస్తుండగా.. చైనా జాతీయ గీతానికి సముచిత గౌరవం ఇవ్వాల్సిందేనని చైనా అనుకూలురు వాదిస్తున్నారు.

ప్రతిపాదిత బిల్లు ప్రకారం.. హాంకాంగ్‌లో చైనా జాతీయ గీతమైన ‘మార్చ్‌ ఆఫ్‌ ద వాలంటీర్స్‌’ గీతాన్ని అవమానిస్తే మూడేళ్ల వరకు జైలుశిక్ష, 50 వేల హాంకాంగ్‌ డాలర్ల వరకు జరిమానా విధించే అవకాశముంది. బిల్లుపై ఓటింగ్‌ సమయంలో ప్రజాస్వామ్య అనుకూల వాదులు సభలో ఆందోళనలు జరిపారు. (చైనా వివాదాస్పద చట్టానికి నేపాల్‌ మద్దతు!)

మరిన్ని వార్తలు