అమెరికాలో భారతీయ జంట మృతి

31 Oct, 2018 01:45 IST|Sakshi
భారతీయ జంట పడిపోయింది ఈ కొండ అంచు నుంచే..

800 అడుగుల ఎత్తు నుంచి కింద పడిన భార్యాభర్తలు

కాలిఫోర్నియాలోని యోసెమిటీ జాతీయ పార్కులో దుర్ఘటన

న్యూయార్క్‌: అమెరికాలోని ఓ జాతీయ పార్కులో 800 అడుగుల ఎత్తు ఉన్న ఒక కొండ అంచు నుంచి కిందకు పడి ఓ భారతీయ జంట దుర్మరణంపాలైంది. మృతులను విష్ణు విశ్వనాథ్‌ (29), మీనాక్షి మూర్తి (30)గా గుర్తించారు. 2014లో పెళ్లిచేసుకున్న వీరు కేరళలోని  ఓ కాలేజీలో ఇంజనీరింగ్‌ పూర్తిచేశారు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని యోసెమిటీ వ్యాలీ జాతీయపార్కులో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

ఆ పార్కులో నిట్టనిలువుగా 800 అడుగుల ఎత్తు ఉండే టఫ్ట్‌ పాయింట్‌ అనే కొండ అంచు ప్రాంతం నుంచి విశ్వనాథ్, మీనాక్షిలు కింద పడ్డారు.గత బుధవారం ఉద్యానవన సందర్శకులు మృతదేహాలను గుర్తించి అధికారులకు సమాచారం ఇవ్వగా గురువారం తీవ్రంగా శ్రమించి ప్రమాద స్థలి నుంచి శవాలను వెలికితీశారు. న్యూయార్క్‌లో నివసించే ఈ జంట ఇటీవలే కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్‌జోసే నగరానికి మారారనీ, అక్కడి సిస్కో కంపెనీలో విశ్వనాథ్‌ ఉద్యోగం చేసేవారని అధికారులు గుర్తించారు. ప్రపంచమంతా తిరుగుతూ తమ అనుభవాలను ‘హాలిడేస్‌ అండ్‌ హ్యాప్పీలీ ఎవర్‌ ఆఫ్టర్స్‌’ అనే బ్లాగ్‌లో రాసేవారు.

పార్కు అధికార ప్రతినిధి జేమీ రిచర్డ్స్‌ మాట్లాడుతూ ‘వారు కింద పడటానికి కారణమేంటో మాకు ఇంకా తెలియదు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఇదొక తీవ్ర విషాద ఘటన’ అని అన్నారు. ఇదే పార్కులో ఈ మేలో ఆశిష్‌ పెనుగొండ (29) అనే భారతీయుడు హాప్‌ డోమ్‌ అనే ప్రాంతానికి ఎక్కుతుండగా కిందపడి మరణించాడు.

ఈ ఏడాదిలోనే పది మంది మృతి
యోసెమిటీ వ్యాలీ అడవి, కొండలతో నిండిన, అందమైన జాతీయపార్కు. ప్రపంచ దేశాల నుంచి ఇక్కడికి పర్యాటకులు ఎక్కువగా వస్తారు. ఇక్కడ దారులు ప్రమాదకరంగా ఉంటాయి. ‘అడుగులు వేసేటప్పుడు అప్రమత్తంగా ఉండకపోతే ఇక్కడ కచ్చితంగా జారిపడతారు’ అని రిచర్డ్స్‌ తెలిపారు.

ఈ ఏడాదిలోనే యోసెమిటీ వ్యాలీ పార్కులో ప్రమాదవశాత్తూ 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే చనిపోయిన పదిమందిలో ఆరుగురు ఇక్కడి కొండలు ఎక్కుతున్నప్పుడే ప్రమాదవశాత్తు కిందపడి చనిపోయారు. విశ్వనాథ్, మీనాక్షిలు పడిపోయిన ‘టఫ్ట్‌ పాయింట్‌’ అనే కొండ అంచు నుంచి చూస్తే యోసెమిటీ పార్కు మొత్తం, యోసెమిటీ జలపాతం, ఎల్‌ క్యాపిటన్‌ కొండ బాగా కనిపిస్తాయి. ఆ సుందర దృశ్యాలను చూసేందుకు ఈ కొండ అంచుకు వస్తారు.

మరిన్ని వార్తలు