అతడు ఇచ్చిన సమాచారంతోనే ఐసిస్‌ చీఫ్‌ హతం!

28 Oct, 2019 08:33 IST|Sakshi

బాగ్దాద్‌ : సిరియాలో మారణహోమం సృష్టించిన ఇస్లామిక్‌ స్టేట్‌ చీఫ్‌ అబు బాకర్‌-అల్‌- బాగ్దాదీని మట్టుబెట్టేందుకు అతడి ప్రధాన అనుచరుడు ఇచ్చిన సమాచారమే తోడ్పడిందని ఇరాక్‌ భద్రతా అధికారులు తెలిపారు. సిరియాను నరకప్రాయం చేయడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా చాపకింద నీరులా వేళ్లూనుకుపోయిన ఉగ్రమూక ఐఎస్‌ చీఫ్‌ను అమెరికా సేనలు ఆదివారం హతం చేసిన విషయం తెలిసిందే. చిన్నారులు సహా వేలాది మంది సిరియన్లను దారుణంగా హతమార్చిన అబు బాకర్‌ బాగ్దాదీని తమ సైన్యం చుట్టుముట్టడంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. ‘ఇస్లాం రాజ్యస్థాపనే లక్ష్యంగా పురుడుపోసుకున్న ఐఎస్‌ ఉగ్రవాద సంస్థ వేలాది మంది ప్రాణాలను తీసింది. కానీ.. దాని స్థాపకుడు బాగ్దాది చివరికి ఒక పిరికివాడిలా తనను తాను అంతం చేసుకున్నాడు’  అని ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అబు బాకర్‌ను అంతమొందించడంలో తమకు సహకరించిన సిరియా కుర్దిష్‌ వర్గాలు, రష్యా, టర్కీ తదితర మిత్రదేశాలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో ఇరాక్‌ భద్రతా అధికారులు ఈ ఆపరేషన్‌లో అబు బాకర్‌ ప్రధాన అనుచరుడు ఇస్మాయిల్‌ అల్‌-ఇతావీ ఇచ్చిన సమాచారం ఎంతగానో ఉపయోగపడిందంటూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.(చదవండి : ఐసిస్‌ చీఫ్‌ బాగ్దాదిని మేం చంపలేదు.. కానీ)

కూరగాయల బస్సుల్లో వెళ్లేవాడు..
అబు బాకర్‌ జాడ కోసం అన్వేషిస్తున్న క్రమంలో అతడి ప్రధాన అనుచరుడు ఇతావీ 2018 ఫిబ్రవరిలో టర్కిష్‌ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం అతడిని ఇరాక్‌ సేనలకు అప్పగించారు. ఈ క్రమంలో విచారణలో భాగంగా... ‘ఐదు ఖండాలలో తన ఉన్మాదంతో విధ్వంసం సృష్టించిన అబు బాకర్‌ ఎల్లప్పుడూ మినీ బస్సుల్లోనే తన సహచరులతో సమావేశమయ్యాడు. కూరగాయలతో నిండిన ఆ బస్సుల్లో వారంతా దొంగచాటుగా గమ్యస్థానాలకు చేరుకునేవారు. ఇస్లామిక్‌ సైన్సెస్‌లో పీహెచ్‌డీ చేసిన ఇతావీ అబు బాకర్‌ ఐదుగురు ముఖ్య అనుచరుల్లో ఒకడు. అతడు 2006లో ఉగ్ర సంస్థ ఆల్‌ ఖైదాలో చేరాడు. 2008లో అమెరికా సేనలకు పట్టుబడటంతో నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించాడు. ఈ క్రమంలో ఇతావీ గురించి తెలుసుకున్న అబు బాకర్‌ తమతో చేతులు కలపాల్సిందిగా అతడిని కోరాడు. ఈ క్రమంలో మత పరమైన సూచనలు ఇవ్వడంతో పాటు ఇస్లామిక్‌ స్టేట్‌ కమాండర్లను ఎంపిక చేయడంలోనూ ఇతావీ కీలక పాత్ర పోషించేవాడు.

ఇందులో భాగంగా 2017లో తన సిరియన్‌ భార్యతో కలిసి పూర్తిగా సిరియాకే మకాం మార్చాడు. అయితే 2018లో టర్కీ అధికారులకు అతడితో పాటు నలుగురు ఇరాకీలు, ఒక సిరియన్‌ చిక్కాడు. దీంతో వాళ్లను మాకు అప్పగించారు. అప్పుడే ఇతావీ మాకు బాగ్దాదీ గురించిన రహస్యాలన్నీ చెప్పాడు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు సిరియాలోని ఇడ్లిబ్‌ అనే ప్రాంతంలో అబు బాకర్‌ తల దాచుకున్నాడని మాకు తెలిసింది. అయితే ఇడ్లిబ్‌పై పట్టు కలిగి ఉన్న, ఐఎస్‌కు వ్యతిరేకంగా పనిచేసే మరో ఉగ్రసంస్థ నుస్రా ఫ్రంట్ అబు బాకర్‌ను చంపేందుకు వెంటపడటంతో.. అతడు తరచుగా వివిధ ప్రాంతాలకు పయనమయ్యేవాడు. ఈ క్రమంలో తన కుటుంబ సభ్యులు, ముగ్గురు అనుచరులను ఎల్లప్పుడూ వెంటబెట్టుకునేవాడని ఇతావీ తెలిపాడు. అదే విధంగా అతడు ఏయే సమయాల్లో ఏ చోట తల దాచుకుంటాడనే విషయాన్ని కూడా మాకు చెప్పాడు. దీంతో మేము అమెరికా భద్రతా సంస్థ సెంట్రల్‌ ఇంటలెజిన్స్‌ ఏజెన్సీతో సమన్వయం చేసుకుని... ఇడ్లిబ్‌ సమీప ప్రాంతాల్లో ఎక్కువ సైన్యాలను మోహరించాలని సూచించాం. ఈ క్రమంలో గత ఐదు నెలలుగా సీఐఏ డ్రోన్స్‌, సాటిలైట్స్‌తో ఆ ప్రాంతంలో గట్టి నిఘా ఏర్పాటు చేసింది. ఇప్పుడు అబు బాకర్‌ హతమయ్యాడు అని ఇరాక్‌ అధికారులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు