ఉపగ్రహాలకు ఎలక్ట్రిక్ చోదక వ్యవస్థ

12 Feb, 2016 04:36 IST|Sakshi

* ఎక్కువ బరువున్న పరికరాలు మోసుకెళ్లేలా ప్రయోగాలు  
* డిసెంబర్‌లో జీఎస్‌ఎల్వీ మార్క్-3, అబార్ట్ మిషన్
* విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డెరైక్టర్ వెల్లడి  
* ప్రారంభమైన హై ఎనర్జీ మెటీరియల్స్ సదస్సు

సాక్షి, హైదరాబాద్: భారత్ ప్రయోగించే ఉపగ్రహాలను మరింత సమర్థంగా ఉపయోగించుకునేందుకు వీలుగా వాటికి ఎలక్ట్రిక్ చోదక వ్యవస్థను జోడించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్‌ఎఎస్‌సీ) డెరైక్టర్ డాక్టర్ కె.శివన్ తెలిపారు. దీనివల్ల ఇంధన ట్యాంకుల సైజు తగ్గుతుందని, దీంతో ఎక్కువ బరువున్న పరికరాలను మోసుకెళ్లడం వీలవుతుందని చెప్పారు.

హైదరాబాద్‌లో గురువారం హై ఎనర్జీ మెటీరియల్స్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సుకు కె.శివన్ ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. జీఎస్‌ఎల్వీ మార్క్-3ని ఈ ఏడాది డిసెంబరులో ప్రయోగిస్తామని వివరించారు. చంద్రుడిపై రోవర్ ల్యాండ్ అయి పరీక్షలు నిర్వహించే లక్ష్యంతో చంద్రయాన్-2 సిద్ధమవుతోంద న్నారు. మానవసహిత ప్రయోగాల్లో భాగంగా అత్యవసర పరిస్థితుల్లో వ్యోమగాములను రక్షించేందుకు ఉద్దేశించిన అబార్ట్ మిషన్‌ను ఈ ఏడాది చివరలో చేపడతామన్నారు.
 
పేలుడు పదార్థాలు గుర్తించేందుకు...
పేలుడు పదార్థాలను గుర్తించేందుకు జాగిలాలు కొంత మేరకే ఉపయోగపడుతున్న నేపథ్యంలో పుణేలోని హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లేబొరేటరీ ఓ కిట్‌ను అభివృద్ధి చేసిందని సంస్థ డెరైక్టర్ డాక్టర్ కేపీఎస్ మూర్తి తెలిపారు. ఈ సాంకేతికతను అగ్రరాజ్యం అమెరికాకు కూడా అందించామని చెప్పారు. మందమైన బ్యాగులు, లోహపు పెట్టెల్లో దాచి ఉంచిన పేలుడు పదార్థాలను కూడా సులువుగా గుర్తించేందుకు తాము ప్రత్యేకమైన పరికరాన్ని అభివృద్ధి చేస్తున్నామని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని ఓ కేంద్రం ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు.

కార్యక్రమంలో డీఆర్‌డీఎల్, అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లేబొరేటరీ (ఎఎస్‌ఎల్) డెరైక్టర్లు కె.జయరామన్, టెస్సీ థామస్‌తోపాటు సదస్సు నిర్వాహక కమిటీ కో చైర్మన్, అగ్ని-3 ప్రాజెక్ట్ డెరైక్టర్  డాక్టర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. డీఆర్‌డీవో డెరైక్టర్ జనరల్ (మిస్సైల్స్) సతీశ్ కుమార్ హై ఎనర్జీ మెటీరియల్స్ కాన్ఫరెన్స్, ఎగ్జిబిట్స్ అంతర్జాతీయ సదస్సును ప్రారంభించారు.

>
మరిన్ని వార్తలు