శ్రీలంక పేలుళ్లలో కేరళ మహిళ మృతి

21 Apr, 2019 18:51 IST|Sakshi

తిరువనంతపురం/కొలంబో: శ్రీలంకలో జరిగిన వరుస పేలుళ్లలో మృతులు సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈస్టర్‌ పర్వదినాన శ్రీలంకలోని ప్రముఖ చర్చిలు, హోటళ్లలోని విదేశీయులు లక్ష్యంగా బాంబు దాడులు జరిగాయి. ఈ పేలుళ్లలో కేరళకు చెందిన ఓ మహిళ కూడా మృతి చెందారు. బాధితురాలిని కాసర్‌గోడ్‌లోని మొగ్రాల్‌ పుత్తూరుకు చెందిన రసీనాగా గుర్తించారు. శ్రీలంక బాంబు పేలుళ్లలో రసీనా మృతి చెందినట్టు కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం ధ్రువీకరించింది.

కొలంబో ఉన్న తమ బంధువులను కలవడం కోసం రసీనా అక్కడికి వెళ్లినట్టుగా తెలుస్తోంది. అయితే రసీనా మృతదేహాన్ని వీలైనంతా తొందరగా స్వస్థలానికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు కేరళ ప్రభుత్వ అధికారులు తెలిపారు. శ్రీలంకలో జరిగిన మరణహోమాన్ని కేరళ సీఎం పినరాయి విజయన్‌ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు షేర్‌ చేశారు. అలాగే శ్రీలంకలోని రసీనా బంధువులతో, భారత హైకమిషన్‌ అధికారులతో తమ సిబ్బంది చర్చలు జరుపుతున్నట్టు పేర్కొన్నారు. 

శ్రీలంకలో ఆదివారం ఎనిమిది చోట్ల జరిగిన బాంబు పేలుళ్లలో 207 మంది మరణించగా, 450 మందికి గాయాలయ్యాయి. మరణించినవారిలో 39 మంది విదేశీయులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. పేలుళ్ల ఘటన అనంతరం శ్రీలంకలో ఎమర్జెన్సీ సర్వీసులు రంగంలోకి దిగాయి. శ్రీలంక వ్యాప్తంగా కర్ఫ్యూ విధించిన అధికారులు.. కొలంబోలో ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేశారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు