భారతీయ అమెరికన్‌కు ప్రెసిడెన్షియల్‌ అవార్డు

19 Oct, 2018 23:32 IST|Sakshi

హూస్టన్‌ :మానవ అక్రమ రవాణను నియంత్రించడంలో అసమాన ప్రతిభ చూపినందుకుగాను భారతీయ అమెరికన్‌ మహిళ మినాల్‌ పటేల్‌ డేవిస్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెన్షియల్‌ అవార్డు లభించింది. హూస్టన్‌ మేయర్‌ సిల్వస్టర్‌ టర్నర్‌కు ప్రత్యేక సలహాదారుగా పని చేస్తున్న పటేల్‌ గత వారం అమెరికా అధ్యక్ష భవనంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ అవార్డును అందుకున్నారు. దేశాధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కూడా ఈ అవార్డు ప్రదానోత్సవానికి హాజరయ్యారు. అమెరికాలో నాలుగో పెద్ద నగరమైన హూస్టన్‌లో లైంగిక బానిసత్వం, కార్మిక దోపిడీ, మానవ అక్రమ రవాణాలను నిరోధించడానికి పటేల్‌ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. న్యూయార్క్‌ యూనివర్సిటీలో బిఏ, కనెక్టికట్‌ యూనివర్సిటీలో ఎంబీఏ చేసిన పటేల్‌ 2015 జులైలో మేయర్‌ ప్రత్యేక సలహాదారుగా నియమితులయ్యారు. గతంలో ఐక్యరాజ్య సమితి ప్రపంచ హ్యుమనిటేరియన్‌ సమ్మిట్‌కు స్పీకర్‌గా పని చేశారు.మానవ అక్రమ రవాణా నిరోధంపై ప్రభుత్వాధికారులతో చర్చించేందుకు పటేల్‌ ఇటీవల భారత దేశం వచ్చారు. భారత పర్యటనలో భాగంగా పటేల్‌ హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మానవ అక్రమ రవాణా నిరోధానికి తమ ప్రభుత్వం  చేపడుతున్న చర్యలను ఆమె వివరించారు. ఈ విషయంలో హూస్టన్, హైదరాబాద్‌లు తీసుకుంటున్న చర్యలను పరస్పరం తెలుసుకోవాలన్నారు.
 

మరిన్ని వార్తలు