కేజీ ఉల్లి @220

18 Nov, 2019 08:49 IST|Sakshi

రేటు చూసి మైండ్‌ బ్లాంక్‌ అయిందా? అయితే ఈ ధర మన దేశంలో కాదు పొరుగునే ఉన్న బంగ్లాదేశ్‌లో. మన దేశం నుంచి దిగుమతి ఆగిపోవడంతో బంగ్లాదేశ్‌లో ఉల్లిపాయల ధరలు మోత మోగిస్తున్నాయి. కేజీ ఉల్లి ఏకంగా 220 రూపాయలకు అమ్ముతున్నారు. ఉల్లిపాయలు కొనాలంటే సామాన్యులు వణికిపోతున్నారు. అనూహ్యంగా ధరలు పెరిగిపోవడంతో పలుచోట్ల వినియోగదారులు ఆందోళనకు దిగారు. దీంతో స్పందించిన ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు  చేపట్టింది. విమానాల ద్వారా టర్కీ, ఈజిప్ట్, చైనా వంటి దేశాల నుంచి ఉల్లి దిగుమతి చేసుకుంటోంది. ప్రభుత్వం పలు చోట్ల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసి రూ. 38కే అందించే ప్రయత్నం చేస్తోంది. కాగా, తన నివాసంలో ఉల్లి వాడకంపై ప్రధాని షేక్‌ హసినా నిషేధం విధించారు. దీంతో శనివారం ప్రధాని నివాసంలో ఉల్లిపాయలు వాడకుండా వంటలు తయారుచేశారని స్థానిక మీడియా వెల్లడించింది.

మరోవైపు మనదేశంలోనూ ఉల్లిపాయల ధరలు మండిపోతున్నాయి. మేలు రకం ఉల్లి కిలో 70 రూపాయల వరకు బహిరంగ మార్కెట్‌ అమ్ముతున్నారు. నెల రోజులుగా ధరలు ఎక్కువగా ఉన్నా పాలకులు పట్టించుకున్నట్టు కనబడటం లేదు. వర్షాల కారణంగా పంటలు దెబ్బతినడంతో ఉల్లిపాయలు ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. మరో రెండు నెలల పాటు ఇవే ధరలు కొనసాగే అవకాశముందని వెల్లడించారు. ధరల పెరుగులతో వినియోగదారులు కూడా తక్కువగానే కొంటున్నారని, దీంతో తమ వ్యాపారాలు మందగించాయని చిన్న వ్యాపారులు వాపోతున్నారు. ఇదిలావుంచితే ఉల్లి ధరల పెరుగుదలపై సోషల్‌ మీడియాలో జోకులు, సెటైర్లు స్వైరవిహారం చేస్తున్నాయి. ఈరోజు నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ఉల్లి ధరల గురించి ప్రతిపక్షాలు ప్రస్తావించనున్నాయి.
 

మరిన్ని వార్తలు