నీకసలు సిగ్గుందా.?

17 Jun, 2018 12:02 IST|Sakshi

పాక్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషార్రఫ్‌ ఫైర్‌ 

కౌంటరిచ్చిన రెహమ్‌ ఖాన్‌

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఐ ఇన్‌సాఫ్‌(పీటీఐ) పార్టీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ మాజీ భార్య రెహమ్‌ ఖాన్‌పై ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషార్రఫ్‌ నిప్పులు చెరిగారు. రెహమ్‌ ఖాన్‌ ఆత్మకథ ‘టెల్‌-ఆల్‌’ నుంచి లీకైన కొన్ని వాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ఓ మహిళవై ఉండి ఇలాంటి రాతలు రాయడానికి సిగ్గుండాలని ఖలీజ్‌ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను తన పార్టీ ఆల్‌ పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ (ఏపీఎంఎల్‌) ట్వీట్‌ చేయగా ముషార్రఫ్‌ రీట్వీట్‌ చేశారు.

‘రెహమ్‌ ఖాన్‌ను పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ (నవాజ్‌) (పీఎంఎల్‌ఎన్‌) తమ ఎజెండా కోసం ఉపయోగించుకుంటుంది. వాట్సాప్‌లో ఆమె పుస్తకంలోని కొన్ని వ్యాఖ్యలను చదివాను. ఇలాంటి రాతలు రాయడానికి ఆమెకు సిగ్గుండాలి. ఇలాంటి చెత్త రాతలను ప్రత్యేకించి మహిళలు రాయకూడదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

మహిళలు ఏం మాట్లాడాలి?
ముషర్రాఫ్‌ వ్యాఖ్యలపై రెహమ్‌ ఖాన్‌ ఘాటుగా స్పందించారు. మరీ మహిళలు ఏం మాట్లాడాలో నిర్ణయించేది ఎవరని ప్రశ్నించారు. ‘ముషర్రాఫ్‌ చేసిన ట్వీట్‌ ఎలా ఉందంటే.. మహిళలు ఏం మాట్లాడవద్దు. పురుషులు ఏం చేసినా సహిస్తూ..  గమ్మునుండాలి. మహిళలు ఏం రాయాలి, ఏం మాట్లాడాలి అని నిర్ణయించాడానికి వీళ్లేవరు. ఇది చాలా తప్పు’ అని ఈ మాజీ జర్నలిస్టు మండిపడ్డారు. పీఎంఎల్‌ఎన్‌ పార్టీతో తనకు సంబంధం ఉన్నట్లు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ‘నాకు నవాజ్‌ షరీఫ్‌ పార్టీ (పీఎంఎల్‌ఎన్‌)తో ఎలాంటి సంబంధాలు లేవు. ఆయన చాలా ధృడమైన వ్యక్తి. వారి ఎజెండాలో భాగంగా నా పుస్తకం రావడం లేదు. ఇంకా నా పుస్తకం విడుదల కూడా కాలేదు. వారి ఎజెండా ప్రకారం నేను నడుచుకోవడం లేదు.’’ అని ఆమె స్పష్టం చేశారు.

రెహమ్‌ ఖాన్‌ తన పుస్తకంలో ఇమ్రాన్‌ ఖాన్‌ ఓ గే అని, పెళ్లికి ముందే తనను వేధించాడని.. మాజీ క్రికెటర్‌ వసీం అక్రమ్‌ శృంగార అనుభవాల కోసం తన మాజీ, దివంగత సతీమణి ఓ నల్ల జాతీయుడితో సెక్స్ చేసేలా చేశాడని, ఆ తతంగాన్ని మొత్తం దగ్గరుండి చూశాడని పేర్కొనడం తీవ్ర దుమారాన్ని రేపింది. పుస్తకం విడుదల చేయడం వెనుక మాజీ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ హస్తం ఉందని పీటీఐ నేతలు ఆరోపిస్తున్నారు. పీటీఐ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌ ఈ పుస్తకాన్ని పాకిస్తాన్‌లో విడుదల చేయకుండా అడ్డుకోవాలని కోర్టును సైతం ఆశ్రయించారు.

చదవండి: ఇమ్రాన్‌ ఖాన్‌ ఓ గే!

మరిన్ని వార్తలు