మనది సహజ సంబంధం

1 Jun, 2018 03:53 IST|Sakshi
సింగపూర్‌లో ప్రధాని మోదీకి స్వాగతం

భారత్, సింగపూర్‌పై ప్రధాని మోదీ

సింగపూర్‌: భారత్, సింగపూర్‌ మధ్య సుహృద్భావ, సన్నిహిత సంబంధాలున్నాయని ప్రధాని మోదీ అన్నారు. సింగపూర్‌తో భారత్‌కు సహజ భాగస్వామ్యం ఉందని, ఇరు దేశాల మైత్రిలో ఎలాంటి బేషజాలు, అనుమానాలు లేవన్నారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా చివరగా గురువారం మోదీ సింగపూర్‌ చేరుకున్నారు. ‘బిజినెస్, ఇన్నోవేషన్, కమ్యూనిటీ ఈవెంట్‌’ అనే కార్యక్రమంలో ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగించారు.

దేశంలో ఆర్థిక సంస్కరణలను వేగంగా అమలుచేస్తున్నామని, నవ భారత్‌ తయారవుతోందని ప్రవాసులకు తెలిపారు. సింగపూర్‌ చిన్న దేశమైనా ఎన్నో విజయాలు సాధించిందని కితాబిచ్చారు. రెండు దేశాల మధ్య ఏటా జరిగే భద్రతా కార్యక్రమం షాంగ్రి–లా డైలాగ్‌లో మోదీ నేడు మాట్లాడనున్నారు. కాలానికి అనుగుణంగా భారత్, సింగపూర్‌ తమ సంబంధాలను నిర్మించుకుంటున్నాయని మోదీ తెలిపారు. ఈ ఏడాది ఆసియాన్‌కు సింగపూర్‌ నేతృత్వం వహిస్తున్నందున భారత్‌–ఆసియాన్‌ సంబంధాలు కొత్త శిఖరాలకు చేరుతాయని ధీమా వ్యక్తం చేశారు.  

సింగపూర్‌లోనూ రూపే, భీమ్‌ యాప్‌లు..
భారత్‌కు చెందిన డిజిటల్‌ చెల్లింపుల యాప్‌ల అంతర్జాతీయీకరణలో ముందడుగు పడింది. భీమ్, రూపే, ఎస్‌బీఐ యాప్‌లను ప్రధాని మోదీ సింగపూర్‌లో ఆవిష్కరించారు. దీనిలో భాగంగా రూపే యాప్‌ను సింగపూర్‌కు చెందిన నెట్‌వర్క్‌ ఫర్‌ ఎలక్ట్రానిక్‌ ట్రాన్స్‌ఫర్‌(నెట్స్‌)తో అనుసంధానించారు. ఫలితంగా రూపే వినియోగదారులు సింగపూర్‌ వ్యాప్తంగా నెట్స్‌ కేంద్రాల వద్ద చెల్లింపులు చేయొచ్చు. అలాగే, సింగపూర్‌ నెట్స్‌ వినియోగదారులు భారత్‌లో నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ) ఈ–కామర్స్‌ వెబ్‌సైట్‌లో కొనుగోళ్లు చేయొచ్చు. ఇక్కడి మెరీనా బే సాండ్స్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో భారత్‌–సింగపూర్‌ దేశాల స్టార్టప్‌ల ఎగ్జిబిషన్‌ను మోదీ సందర్శించారు. ఆయన వెంట సింగపూర్‌ ప్రధాని లీ సీన్‌ లూంగ్‌ ఉన్నారు. రెండు దేశాలకు చెందిన 30 స్టార్టప్‌ కంపెనీలు ఇక్కడ తమ ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించాయి.

మలేసియాలో మజిలీ..
గురువారం ఉదయం ఇండోనేసియా పర్యటన ముగించుకుని సింగపూర్‌ బయల్దేరిన మోదీ మార్గమధ్యలో మలేసియాలో కొద్దిసేపు ఆగారు. ఇటీవలే మలేసియా ప్రధానిగా ఎన్నికైన మహాథిర్‌ మొహమ్మద్‌ను కలుసుకుని, ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ తరువాత ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. మహాథిర్‌తో చర్చలు ఫలప్రదంగా జరిగాయని మోదీ ట్వీట్‌ చేశారు. రెండు దేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాల బలోపేతానికి ఉన్న మార్గాలపై మోదీ, మహాథిర్‌ పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ తెలిపారు. మలేసియా ఉపప్రధాని డా.వాన్‌ అజీజా వాన్‌ ఇస్మాయిల్‌ను కూడా మోదీ కలుసుకున్నారు.

>
మరిన్ని వార్తలు