ఖషోగ్గీ హత్య; స్పందించిన సౌదీ యువరాజు

25 Oct, 2018 09:15 IST|Sakshi

రియాద్‌ : ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జర్నలిస్టు జమాల్‌ ఖషోగ్గీ హత్యపై సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ఎట్టకేలకు స్పందించారు. ఖషోగ్గీ హత్యను అత్యంత క్రూరమైన చర్యగా సల్మాన్‌ అభివర్ణించారు. ఇటువంటి హేయమైన నేరాలను ఎవరూ కూడా సమర్థించరంటూ వ్యాఖ్యానించారు. ఖషోగ్గీ హత్య సౌదీలందరినీ ఎంతగానో బాధించిందన్నారు. బుధవారం రియాద్‌లో జరిగిన ఫ్యూచర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఇనిషియేటివ్‌ కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్‌ మాట్లాడుతూ.. ఖషోగ్గీ హంతకులను పట్టుకునేందుకు సౌదీ అరేబియా కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ విషయంలో టర్కీ తమకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఖషోగ్గీ మరణం టర్కీ- సౌదీ సంబంధాల మధ్య అడ్డుగోడగా నిలుస్తుందని తాను భావించడం లేదన్నారు. నేరస్తులు ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని, చివరికి న్యాయమే గెలిచి తీరుతుందంటూ వ్యాఖ్యానించారు.

కాగా సౌదీ జాతీయుడైన ఖషోగ్గీ అమెరికాలో ఉంటూ సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ అనుసరిస్తున్న విధానాలను  విమర్శిస్తూ వాషింగ్టన్‌ పోస్ట్‌లో కథనాలు రాసేవారు. ఈ నెల 2న తన వ్యక్తిగత పనిపై ఖషోగ్గీ టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ ఎంబసీలోకి వెళ్లి అదృశ్యమయ్యారు. ఖషోగ్గీని ఎంబసీలోనే చంపేశారని టర్కీ ఆరోపించింది. అయితే ఖషోగ్గీ మృతితో తమకు సంబంధం లేదని మొదట ప్రకటించిన సౌదీ.. ఆ తరువాత మాటమార్చి ఎంబసీలోనే ఓ గొడవలో ఆయన మరణించాడంది. అయితే, తనపై విమర్శనాత్మక కథనాలు రాసినందుకు ఖషోగ్గీని మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ చంపించాడని ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఖషోగ్గీ హత్య గురించి అంతర్జాతీయ సమాజం నుంచి.. ముఖ్యంగా తనకు ఇన్నాళ్లుగా అనుకూలంగా మాట్లాడుతూ వస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నుంచి ఒత్తిడి వస్తోన్న నేపథ్యంలోనే సల్మాన్‌ స్పందించక తప్పలేదు. ఖషోగ్గీ మరణం వెనుక సల్మాన్‌ ఉన్నారంటూ ట్రంప్‌ అనుమానం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు