ఇమ్రాన్‌ ఖాన్‌పై దాడి

14 Mar, 2018 08:55 IST|Sakshi

లాహోర్‌ : ఇటీవలే మూడోపెళ్లిచేసుకుని, రెండో భార్య ఆరోపణలతో ఇబ్బందులపాలైన మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌కు మరో చేదుఅనుభవం ఎదురైంది. పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఎ ఇన్సాఫ్‌(పీటీఐ) మంగళవారం గుజరాత్‌(పంజాబ్‌ ఫ్రావిన్స్‌)లో నిర్వహించిన సభలో ఆయనపై చెప్పులతో దాడి జరిగింది. వాహనం టాప్‌పైన నిలబడి ప్రసంగిస్తున్న సమయంలో ఇమ్రాన్‌పైకి ఓ యువకుడు బూటువిసిరాడు. అయితే అదికాస్తా గురితప్పి పక్కనున్న నాయకుడికి తగిలింది. వెంటనే అప్రమత్తమైన పీటీఐ కార్యకర్తలు.. షూ విరిసిన వ్యక్తిని పట్టుకుని చితకబాదాదిన తర్వాత పోలీసులకు అప్పగించారు. బూటుదాడి జరగడంతో ఇమ్రాన్‌ తన ప్రసంగాన్ని కాస్త ముందుగానే పూర్తిచేసి వెళ్లిపోయారు.

వరుస దాడులతో నేతల బెంబేలు : పాకిస్తాన్‌ జాతీయ అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్న తరుణాన అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే ముఖ్యనేతలంతా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇదే అదనుగా వారివారి వ్యతిరేకులు ఆందోళనలు, దాడులకు పాల్పడుతున్నారు. నిన్నటికి నిన్న పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌పై బూటు దాడి జరింది. అంతకు కొద్ది రోజుల ముందే విదేశాంగ శాఖ మంత్రి ఖవాజాపై ఓ యువకుడు చెప్పులు విసిరాడు. ఇక ఇమ్రాన్‌పైనేతే.. గతవారం కూడా ఓ బూటుదాడి జరిగింది.

మరిన్ని వార్తలు