బిల్డింగ్‌ను మడిచేద్దాం..!

22 Apr, 2018 01:48 IST|Sakshi

భూకంపాలు.. వరదలు వచ్చినప్పుడు జనం బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తుంది. ఉండటానికి నిలువ నీడ లేక.. తినేందుకు తిండి లేక అల్లాడిపోతుంటారు. వారికి పునరావాసం కల్పించాలంటే సమయం.. శ్రమ.. డబ్బుతో కూడుకున్న వ్యవహారం. పైగా ఎప్పుడు ఎక్కడ ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయో కూడా తెలియదు. ఇలాంటి వారి కోసమే పోలండ్‌కు చెందిన స్కై షెల్టర్‌ అనే డిజైనర్‌ కంపెనీ అద్భుతమైన భవనాన్ని డిజైన్‌ చేసింది.

దీని ప్రత్యేకత ఏంటంటే ఆ భవనాన్ని ఎక్కడికి కావాలంటే అక్కడికి మడిచి తీసుకెళ్లొచ్చు.. భవనాన్ని ఎలా మడిచేస్తారని ఆశ్చర్యపోకండి.. హీలియం నింపేందుకు అనువైన బెలూన్లతో ఈ భవనాన్ని తయారు చేస్తారు. ఆ బెలూన్ల లోపల ముడుచుకుపోయేలా వీలున్న స్టీలు ఫ్రేముల ను ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత ఎక్కడికైనా తీసుకెళ్లాలనుకున్నపుడు ఆ బెలూన్లను దగ్గరికి మడిచి హెలికాప్టర్ల సాయంతో తీసుకెళ్లొచ్చు.

బాధితులకు తాత్కాలిక పునరావాసం కల్పించాలనుకుంటే వెంటనే హీలియం వాయువును ఆ బెలూన్లలోకి పంపిస్తే భవనం వ్యాకోచిస్తుంది. ఆ తర్వాత అందులో బాధితులకు ఎంచక్కా పునరావాసం కల్పించవచ్చు. ‘ఇవోలో’అనే పోటీలో ఈ భవనం నమూనా దాదాపు 525 భవన నమూనాలను తోసిపుచ్చి మొదటి స్థానంలో నిలిచింది.

మరిన్ని వార్తలు