మట్టి వాసన గుర్తుందా..? | Sakshi
Sakshi News home page

Published Sun, Apr 22 2018 1:52 AM

Aamir Khan Satyamev Jayate Program Awareness In People - Sakshi

కాంక్రీటు జంగిల్‌లో అలవాటు పడి, పక్కవాడిని పట్టించుకోవడానికి కూడా నామోషీ పడి, మనది కాని ప్రపంచాన్ని మనదనే భ్రమల్లో బతుకుతున్న మనందరం వేసుకోవాల్సిన ప్రశ్న. చివరిసారిగా మట్టి వాసన ఎప్పుడు ఆస్వాదించాం అని.. రైతులంతా తొలకరి వర్షం కోసం ఎదురుచూస్తే పిల్లగుంపు మాత్రం తొలకరి వాన మోసుకొచ్చే మట్టి వాసన కోసం ఎదురుచూసిన అనుభవం ప్రతి పల్లెమనిషికీ సుపరిచితమే. మల్లెపువ్వు పరిమళం.. మంచి గంధపు సువాసన.. వానమబ్బుకు చిగురుటాకుకు మధ్య వారధి అది.. ఆ చినుకే లేకపోతే రైతుకు కునుకే లేదు. బాలీవుడ్‌ హీరో ఆమిర్‌ఖాన్‌ ఈ మధ్య బ్రహ్మాండమైన ఓ ప్రశ్న వేశారు.. సమాజానికి పట్టుకొమ్మలైన పల్లెలనూ, వాటినే అంటిపెట్టుకుని ఉండే మట్టి మనుషులనూ గుర్తుచేసుకుంటూ అడిగిన ఆ ప్రశ్న మనల్ని తట్టిలేపుతుంది. మనం పుట్టి పెరిగిన ఊరును.. ఎప్పుడో మరిచిపోయిన స్నేహితులనూ, నిత్యం వెంటాడే తీపి జ్ఞాపకాలను తట్టిలేపే ఆ ప్రశ్న మనందరం వేసుకోవాల్సింది.. ఇంతకీ ఆ ప్రశ్నేంటంటే ‘మీరు చివరి సారిగా మట్టి వాసన’ ఎప్పుడు చూసారు? 

ఆమిర్‌ఖాన్‌ ‘సత్యమేవ జయతే’ కార్యక్రమం దేశంలోని అనేక వర్గాల ప్రజలకు సామాజిక చైతన్యాన్ని అందిస్తోంది. పానీ ఫౌండేషన్‌ ద్వారా ‘సేవ్‌ వాటర్‌’ కార్యక్రమానికి ఆమిర్‌ఖాన్‌ 2016లో శ్రీకారం చుట్టారు. ఉమ్మడి కృషి, సమైక్య శ్రమ ద్వారా ఏ సమస్యనైనా ఎదుర్కోగలమన్న నమ్మకంతో ముందుకు సాగుతూ ఆమిర్‌ బృందం ప్రజల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపింది. ఓ రోజు ఆయనో చెట్టు నీడన కూర్చుని సమాజాన్ని సూటిగా.. సున్నితంగా ప్రశ్నించారు. ఆ ప్రశ్నల పరంపరలోనిదే ‘మీరంతా మట్టి వాసన చూసి ఎన్నిరోజులయిందీ?’ అని. 


మట్టి వాసన గుర్తుంచుకోవడమంటే మనల్ని మనం బతికించుకోవడం..  
మనం మరిచిన పల్లె జనాన్ని గుర్తుంచుకోవడం..  
మనకి పట్టెడన్నం పెట్టే రైతన్నని గుర్తుంచుకోవడం.. 
మనం విడదీస్తున్న భూమికీ, మనిషికీ మధ్య అనుబంధాన్ని గుర్తుంచుకోవడం.. 
మనం తరిమికొడుతున్న పచ్చదనాన్ని గుర్తుంచుకోవడం.. 
మనం కాపాడుకోవాల్సిన మానవ సంబంధాల్ని గుర్తుంచుకోవడం.. 

Advertisement
Advertisement