టిక్‌... టిక్‌... టిక్‌

20 Sep, 2019 03:03 IST|Sakshi

ఓ గ్రహశకలం.. వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది.. అప్పుడో.. ఇప్పుడో భూమిని తాకడం ఖాయం! ప్రజలందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నారు.. ఇంతలోనే ఓ అద్భుతం జరిగింది.. భూమ్మీది నుంచి దూసుకెళ్లిన అంతరిక్ష నౌక.. ఆ గ్రహశకలాన్ని.. ఢీకొట్టింది! వెంటనే అది పటాపంచలైంది.. 

ఇదేదో సినిమా కథ అనుకునేరు. అన్నీ సవ్యంగా సాగితే ఇంకో మూడేళ్లలో మనం ప్రత్యక్షంగా చూడబోయే ఘటనే ఇది. భారీ గ్రహశకలం భూమి వైపు దూసుకొస్తోందన్న వార్తలు మనం అప్పుడప్పుడు వింటూనే ఉంటాం. తీరా చూస్తే అవి భూమికి కొన్ని లక్షల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లిపోయిందని, లేదా కక్ష్యమార్గం మార్చుకుందని తెలియగానే ఊపిరి పీల్చుకుంటాం. భవిష్యత్తులో ఏదైనా గ్రహశకలం భూమిని ఢీకొడుతుందని తెలిస్తే.. ఏం చేయాలి.. దాన్నుంచి ఎలా తప్పించుకోవాలి.. రాకెట్లతో ఆ గ్రహశకలాన్ని పేల్చేస్తే సమస్య తీరిపోతుందా.. గ్రహశకలాన్ని ముక్కలుగా చేయాలా.. లేదా రాకెట్‌తో ఢీకొట్టిస్తే దాని దిశ మారిపోయి మనకు ప్రమాదం తప్పిపోతుందా.. ఇలాంటి బోలెడన్ని ప్రశ్నలకు సమాధానం  వెతికేందుకు శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ (ఈఎస్‌ఏ)లు సంయుక్తంగా డబుల్‌ ఆస్టరాయిడ్‌ రీడైరెక్షన్‌ టెస్ట్‌ (డార్ట్‌) అనే ప్రయోగాన్ని చేపట్టనున్నాయి. ఇందులో భాగంగా 2022 సెప్టెంబర్‌లో ఓ గ్రహశకలాన్ని అంతరిక్ష నౌకతో ఢీ కొట్టనున్నారు. దానికి ఒక ఏడాది ముందు చిన్న ఉపగ్రహంతో కూడిన అంతరిక్ష నౌక నింగిలోకి ఎగరనుంది. 

ఏమిటా గ్రహశకలం? 
ఈ ప్రయోగానికి ఎంచుకున్న గ్రహశకలం పేరు డిడైమోస్‌–బి. ఇది ఒకే గ్రహశకలం కాదు. రెండు శకలాలతో కూడిన వ్యవస్థ. అందులో చిన్నసైజులో ఉండే ‘బి’శకలాన్ని ఢీకొట్టాలన్నది ప్రణాళిక. భూమికి కొంచెం దూరంలోనే ఉండే ఈ వ్యవస్థలో ‘ఏ’శకలం 780 మీటర్ల వెడల్పు ఉంటే.. ‘బి’160 మీటర్లు మాత్రమే ఉంటుంది. 12 గంటలకోసారి ‘ఏ’చుట్టూ తిరుగుతుంది. పైగా డిడైమోస్‌ వ్యవస్థ భూమి వైపు దూసుకు రావట్లేదు కాబట్టి దీన్ని అంతరిక్ష నౌకతో ఢీ కొట్టించినా మనకు వచ్చే నష్టమేమీ ఉండదు. జపాన్‌కు చెందిన హయబుస–2 అంతరిక్ష నౌక ఈ ఏడాది ఏప్రిల్‌లో రైగూ అనే గ్రహశకలాన్ని ఢీకొన్నప్పుడు తెలిసిన కొన్ని కొత్త సంగతులను పరీక్షించేందుకు ఈ తాజా ప్రయోగం ఉపయోగపడుతుందని జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్త నాన్సీ చాబోట్‌ అంటున్నారు. భవిష్యత్‌ ప్రమాదాలను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకునేందుకు డిడైమోస్‌ చాలా అనువైందని చెప్పారు.

వేగాన్ని మారుస్తారు.. అంతే! 
సుమారు గంటకు 23,760 కిలోమీటర్ల వేగంతో అంతరిక్ష నౌక డిడైమోస్‌–బిని ఢీకొడుతుంది. అయినాసరే.. ఆ గ్రహశకలమేమీ ముక్కలు కాదు కానీ దాని వేగం స్వల్పంగా తగ్గుతుంది. అది కూడా సెకనుకు సెంటీమీటర్‌ వరకు మాత్రమే ఉంటుందని.. ఈ స్వల్ప మార్పుతోనే అది డిడైమోస్‌–ఏ చుట్టూ తిరిగే కాలంలో మార్పులు వస్తాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. భూమికి చేటు తేగల గ్రహశకలాలను ఇలాగే నిరపాయకరంగా మార్చొచ్చా.. అనేది పరిశీలిస్తారు. ఇందుకు తగ్గట్లే ఢీకొనేందుకు కొన్ని క్షణాల ముందు ఓ చిన్న క్యూబ్‌శాట్‌ డార్ట్‌ నుంచి విడిపోయి.. ఫొటోలు తీసి మనకు పంపుతుంది. దాంతో పాటు 2023లో యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ ప్రయోగించే హెరా అనే అంతరిక్ష నౌక కూడా ఈ గ్రహశకలాన్ని పరిశీలించే ఏర్పాట్లు చేశారు. తద్వారా గ్రహశకలాన్ని అంతరిక్ష నౌకతో ఢీకొట్టించడమన్న ప్రయోగం విజయవంతమైందా.. లేదా అన్నది తెలుస్తుంది. 

ఏవి ప్రమాదకరం?
అంతరిక్షం నుంచి దూసు కొచ్చే వేల గ్రహశకలాలతో భూమికి నిత్యం ప్రమాదం పొంచి ఉంటుంది. చిన్న గ్రహశకలాలు భూ వాతావరణంలోకి చేరిన వెంటనే మండిపోతాయి. రోజూ ఇలాంటి చిన్న సైజు గ్రహశకలాలు భూ వాతావరణంలోకి ప్రవేశిస్తూనే ఉంటాయి. పెద్దసైజువి మాత్రం కొంచెం అరుదు. ఒక అంచనా ప్రకారం కిలోమీటర్‌ కంటే ఎక్కువ సైజున్న గ్రహశకలాలు సుమారు 200 వరకు ఉండగా.. అన్ని సైజుల శకలాల సంఖ్య దాదాపు 2 వేలకు పైగానే ఉన్నాయి. 1999లో గుర్తించిన అపోలో (53319) 1999 జేఎం8 7 కిలోమీటర్ల వెడల్పుతో అతిపెద్ద గ్రహశకలం గా గుర్తింపు పొందింది. గ్రహశకలం 35 మీటర్ల కంటే పెద్ద సైజులో ఉండి.. భూమిని ఢీకొడితే ఒక నగరం స్థాయిలో విధ్వంసం జరుగుతుంది. కిలోమీటర్‌ సైజున్నవి ఢీకొంటే ప్రాణ నష్టం ఒక దేశం లేదా ఖండం స్థాయిలో ఉంటుంది. 
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌   

మరిన్ని వార్తలు