గే వివాహాలను చట్టబద్ధం చేసిన తైవాన్‌

17 May, 2019 15:58 IST|Sakshi

తైపీ : స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేస్తూ తైవాన్‌ ప్రభుత్వం కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. తద్వారా గే వివాహాలను చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశంగా నిలిచింది. పార్లమెంటు బయట వేలాది మంది హర్ష ధ్వానాలు వినిపిస్తుండగా..శుక్రవారం ఇందుకు సంబంధించిన బిల్లును ఆమోదించింది. దీంతో సామాన్య వివాహ చట్టంలో ఉండే అన్ని నిబంధనలు స్కలింగ సంపర్కులకు కూడా వర్తించనున్నాయి. డెమొక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ(డీపీపీ) ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టం మే 24 నుంచి అమల్లోకి రానుంది.

కాగా స్వలింగ సంపర్క వివాహాలను చట్టబద్ధం చేసి చరిత్ర సృష్టించామని తైవాన్‌ అధ్యక్షురాలు సా యింగ్‌-వెన్‌ ట్విటర్‌ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు... ‘ శుభోదయం తైవాన్‌. ఈరోజు కొత్త చరిత్ర సృష్టించేందుకు మాకు అవకాశం దక్కింది. అదే విధంగా తూర్పు ఆసియా నుంచే ఆధునిక భావజాలం విలువలకు సంబంధించిన మూలాలు రూపుదిద్దుకుంటాయనే విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పాం. అంతేకాదు ప్రేమే గెలిచిందని కూడా ప్రపంచానికి చూపించాం. సమానత్వ భావాన్ని పెంపొందించేందుకు, తైవాన్‌ను మెరుగైన దేశంగా నిలిపేందుకు నేడు ముందడుగు వేశాం’ అని ట్వీట్‌ చేశారు.

ఇక డీపీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టం పట్ల ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. రెండేళ్ల క్రితం గే వివాహాల చట్టబద్ధతపై నిర్వహించిన రెఫరెండంలో భాగంగా.. అత్యధిక మంది దీనిని వ్యతిరేకించారని గుర్తు చేశాయి. వివాహం అనేది ఆడ, మగ మధ్య మాత్రమే జరగాలనే మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని సా యింగ్‌-వెన్‌ అవమానపరిచారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాగా ఈ చట్టం వల్ల తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిసినా, గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు ఆమె ఈ చట్టం తీసుకువచ్చారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆమె గెలుపుపై నీలినీడలు కమ్ముకమ్ముకున్నట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.  

మరిన్ని వార్తలు