పిచ్చెక్కించే ‘పోకేమాన్‌ గో’కు ఫిదా అయ్యా!

26 Jun, 2020 15:15 IST|Sakshi

ఒకేసారి 64 మొబైళ్లతో పోకేమాన్‌ గో

ప్రపంచాన్ని ఉర్రుతలూగించిన 'పోకేమాన్ గో' ఆండ్రాయిడ్ గేమ్‌తో తైవాన్‌కు చెందిన చెన్‌సున్‌ యాన్‌ మరోసారి దర్శనమిచ్చాడు. ఏకంగా 64 మొబైల్‌ ఫోన్లతో పోకేమాన్‌ ఆడుతూ తెగ ఎంజాయ్‌ చేస్తున్నాడు. వాటన్నింటినీ నెమలి పించం మాదిరిగా సైకిల్‌కు అమర్చి న్యూ తైపీ నగరం వీధుల్లో తిరుగుతూ గేమ్‌ ఆడుతున్నాడు. పిల్లలు, పెద్దవారిని ఆకర్షిస్తున్నాడు. 72 ఏళ్ల చెన్‌సున్‌ తనకు ఈ గేమ్‌ వ్యసనంలా మారిపోయిందని, దాన్ని వదలబుద్ధి కావడం లేదని చెప్తున్నాడు. కొన్నేళ్ల కిందట తన మనుమడితో సరదాగా ఆడిన ఈ ఆటకు బానిసనయ్యానని తెలిపాడు. అయితే, పోకేమాన్‌ గో తనకు ఎంతో ఇష్టమైన ఆన్‌లైన్‌ గేమ్‌ అని, ఇదంతా పిల్లల సరదాకోసం కూడా చేస్తున్నానని అంటున్నాడు. కాగా, గతంలో సైకిల్‌పై 20 ఫోన్లు, 30 ఫోన్లు అమర్చి పోకేమాన్‌ ఆడిన చెన్‌సున్‌ 2019లో ఆ సంఖ్యను 45కు చేర్చాడు.

తాజాగా 64 ఫోన్లను సైకిల్‌కు ఫిక్స్‌ చేసి తన రికార్డును తనే తిరగరాశాడు. ఇక దేశీయ అసుస్‌ మొబైల్‌ ఫోన్లతో పోకేమాన్‌ ఆడుతున్న పెద్దాయనకు గతేడాది ఓ ఆఫర్‌ వచ్చిందట. అసుస్‌ మొబైల్‌ సంస్థ తన ‘అసుస్‌ జెన్‌ఫోన్‌ మాక్స్‌ ప్రో ఎం2’ మొబైల్‌ లాంచింగ్‌కు ఆహ్వానించిందట! ఇక చెన్‌సున్‌ లక్ష్యం 72 మొబైల్‌ ఫోన్లతో పోకేమాన్‌ ఆడటమని తెలిసింది. కానీ, మొబైళ్లు, వాటికి పవర్‌ బ్యాంకులు, కేబుళ్లు, అమర్చడానికి ప్లాస్టిక్‌ హ్యాండిళ్లతో కలిపి మొత్తం బరువు 22 కిలోలు. ఇది మరింత పెరిగితే సైకిల్‌ పాడవుతుందనే ఉద్దేశంతో చెన్‌సున్‌ ఆ ప్రయతాన్ని వాయిదా వేసుకున్నాడట. అతని వద్ద ఉన్న మొబైల్‌ ఫోన్ల విలువ అక్షరాల రూ.3,40,000. మరోవైపు అంతభారీ స్థాయిలో గేమ్‌ ఆడటం వల్ల చెన్‌సున్‌కు కంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు.
(చదవండి: అమ్మ‌కానికి చే గువేరా జ‌న్మించిన భ‌వ‌నం)

మరిన్ని వార్తలు