ఈ యాప్‌తో ఆహార వృధాకు అడ్డుకట్ట...

28 May, 2014 03:02 IST|Sakshi
ఈ యాప్‌తో ఆహార వృధాకు అడ్డుకట్ట...

అన్నం పరబ్రహ్మ స్వరూపం.. అందరికీ ఈ సంగతి తెలిసినా చాలాసార్లు ఆహారాన్ని మాత్రం వ్యర్థం చేస్తుంటారు. ఇళ్లలో, హోటళ్లలో, పెళ్లిళ్లు, ఇతర వేడుకల సందర్భంగా ఎన్నో రకాలుగా ఆహారం పెద్ద ఎత్తున వృథా అవుతుంటుంది. అందుకే ఆహారం వృథా కాకుండా నివారించాలని ఆలోచించిన భారత సంతతి ఆవిష్కర్త ఒకరు దీనికి ఓ పరిష్కారాన్ని కనుగొన్నారు. ఆకలితో ఉన్న వినియోగదారులకు, రెస్టారెంట్లు, హోటళ్లలో మిగిలిపోయే ఆహారాన్ని చౌకగానే అందించేందుకు వీలుగా ఓ సరికొత్త మొబైల్ అప్లికేషన్(యాప్)ను రూపొందించారు.

ఒక్క అమెరికాలోనే ఏటా 16,500 కోట్ల డాలర్ల విలువైన ఆహారం చెత్తకుప్పల పాలు అవుతోందని తెలుసుకున్న తాను మరో ఇద్దరితో కలసి ‘పేర్‌అప్’ అనే ఈ యాప్‌ను అభివృద్ధిపర్చినట్లు న్యూయార్క్‌కు చెందిన అనూజ్ ఝంఝన్‌వాలా తెలిపారు. ఏ హోటల్‌లో ఎంత ఆహారం మిగిలిపోయి ఉంది? అది ఎంత చౌక ధరకు లభిస్తుంది? అన్నది ప్రతిరోజూ వినియోగదారులు ఈ యాప్‌తో తెలుసుకోవచ్చు. వినియోగదారులకు, హోటళ్ల నిర్వాహకులకు ఉపయోగకరమైన ఈ ఉచిత యాప్‌ను త్వరలో విడుదల చేయనున్నారు.
 
 

మరిన్ని వార్తలు