లెక్క తేలింది! | Sakshi
Sakshi News home page

లెక్క తేలింది!

Published Wed, May 28 2014 3:03 AM

లెక్క తేలింది! - Sakshi

కార్పొరేషన్, న్యూస్‌లైన్ : ఎట్టకేలకు నగర పాలక సంస్థ పరిధిలోని డివిజన్ల సంఖ్య ఖరారైంది. 53 డివిజన్లతో విస్తరించిన బల్దియాలో 42 పంచాయతీల విలీనంతో అదనంగా ఐదు డివిజన్లు పెరిగాయి. దీంతో డివిజన్ల సంఖ్య 58కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర మునిసిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్‌కే.జోషి మంగళవారం జీఓ నం.122 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. ట్రై సిటీలో ఉన్న 53 పాత డివిజన్లు, 42 విలీన గ్రామాల్లో 2011 జనాభా లెక్కల ప్రకారం 8,19,602 మంది జానాభా ఉన్నారు. లెక్కల నివేదికను కూడా బల్దియా అధికారులు రాష్ట్ర పురపాలక శాఖ అధికారులకు పంపించారు. అయితే మునిసిపల్ కార్పొరేషన్ నిబంధనల ప్రకారం 4లక్షల జనాభా దాటితే విధిగా 50 డివిజన్లు ఏర్పాటు చేయాలి.
 
 ఇంతకంటే ఎక్కువ జనాభా ఉంటే 50వేల జనాభాకు ఒకటి చొప్పన డివిజన్లను ఏర్పాటు చేయాలి. ఈ లెక్కన నగర పాలక సంస్థ పరిధిలో 58 డివిజన్లను అధికారులు ఖరారు చేశారు. 1994లో మునిసిపాలిటీ నుంచి వరంగల్ నగర పాలక సంస్థగా అప్‌గ్రేడ్ అయింది. 2005 ఏప్రిల్ 28న డివిజన్ల పునర్విభజనతో పెరిగిన జనాభా ప్రకారం 50 నుంచి 53 డివిజన్లకు పెరిగాయి. 2013 మార్చి నెలలో నగర శివారులోని 42 గ్రామ పంచాయతీలు నగర పాలక సంస్థలో విలీనమయ్యాయి. దీనిని వ్యతిరేకిస్తూ 8 పంచాయతీల ప్రజలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వం 53 డివిజన్లు, 34 విలీన పంచాయతీల జనాభాతో డివిజన్ల సంఖ్య 57కు చేరింది.
 
 ఈ క్రమంలో టీడీపీ నాయకులు హైకోర్టును రెండుమార్లు ఆశ్రయించడం, పురపాలక శాఖ అధికారులు దీనిపై దృష్టి కేంద్రీకరించడం లాంటి సంఘటనలతో డివిజన్ల పునర్విభజన ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. ఆరు నెలల క్రితం విలీనమైన 8 పంచాయతీలపై ఉన్న స్టేను ఎత్తివేస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు 53 డివిజన్లు, విలీనమైన 42 గ్రామాల ప్రజల వివరాలు, 2011 జనాభా లెక్కలను రాష్ట్ర పురపాలక శాఖ అధికారులకు పంపించారు. దీంతో బల్దియా పరిధిలో డివిజన్ల సంఖ్యను ఖరారు చేస్తూ పురపాలక శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
 
 షెడ్యూల్ విడుదలే ఆలస్యం
 నగర పాలక సంస్థ డివిజన్ల సంఖ్య ఖరారైన నేపథ్యంలో డివిజన్ల పునర్విభజన ఆదేశాలు వి డుదల కావాల్సి ఉంది. పురపాలక శాఖ నుం చి కూడా ఉత్తర్వులు వెల్లడి కావాల్సి ఉంది. ఈ క్రమంలో బల్దియా అధికారులు పునర్విభజన కోసం డివిజన్లవారీగా డ్రాఫ్టు ముసాయిదాను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పిస్తారు. పునర్విభజన షెడ్యూల్ వెల్లడి కాగానే.. డివి జన్లవారీగా నోటిఫికేషన్ విడుదల చేసి ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలను పరిగణనలో కి తీసుకొని స్వల్ప మార్పులు చేసి ప్రభుత్వాని కి పంపించనున్నారు. దీనికి ప్రభుత్వం ఆమోదముద్ర వేయనుంది. ఈ ప్రక్రియ అంతా అ నుకున్నట్లు జరిగితే నెలన్నర రోజుల్లో పూర్తవుతుందని బల్దియా అధికారులు చెబుతున్నారు.
 
పూర్తయిన కసరత్తు
డివిజన్ల పునర్విభజనకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జీఓ విడుదల చేయకముందే టౌన్ ప్లానింగ్ అధికారులు డివిజన్ల డ్రాఫ్టు ముసాయిదాను సిద్ధం చేశారు. కమిషనర్ సువర్ణ పండాదాస్ ఆదేశాల మేరకు డివిజన్ల పునర్విభజన డ్రాఫ్టు, మ్యాపులు సిద్ధం చేశారు. 12వేల నుంచి 13వేల జనాభాకు అటు ఇటుగా ఒక్కో డివిజన్ కోసం ప్రణాళికలు తయారు చేశారు. ప్రభుత్వం నుంచి పునర్విభజన షెడ్యూల్ వెల్లడి కాగానే ప్రక్రియ మొదలుకానుంది.

Advertisement
Advertisement