అనగనగా ఓ ఊరు

20 Dec, 2018 01:47 IST|Sakshi

జపాన్‌లోని షికోకు అనే ద్వీపం.. అక్కడ కొండకోనల్లో నగోరో అనే చిన్న పల్లె.. అక్కడ అందరూ కష్టజీవులే అనుకుంటా.. ఎందుకంటే.. ఈ గ్రామానికి వెళ్లి చూస్తే.. రోడ్డు పనులు చేస్తూ కొందరు.. పొలాల్లో మరికొందరు.. చేపలు పడుతూ ఇంకొందరు.. ఇలా ఎక్కడ చూసినా జనం పనిచేస్తూ కనిపిస్తారు.. కనిపించడమే గానీ.. ఒక్కమాటా వినిపించదు.. దీంతో మాట్లాడదామని దగ్గరకు వెళ్తే గానీ.. మనకు అసలు విషయం బోధపడదు.. వాళ్లు మనుషులు కాదు.. బొమ్మలని..! ఆ పల్లె జనాభా 40 లోపే.. బొమ్మల జనాభా దాదాపు 350!  
ఇంతకీ ఏమిటీ బొమ్మల కథ.. 
కొంచెం తేడాగా ఇది ప్రతి పల్లె కథ.. పని కోసం ఆ పల్లె కూడా నడిచింది పట్నపు దారుల వెంట.. చదువుల కోసం, ఉద్యోగాల కోసం జనం ఊరును విడిచారు.. ఊరును మరిచారు. టకుమి అయానో తప్ప.. ఆమె చిన్నప్పుడే వాళ్ల కుటుంబం ఊరు విడిచి వెళ్లిపోయింది. అయితే, 2000 సంవత్పరంలో టకుమి తిరిగి వచ్చింది. తన తండ్రి బాగోగులు చూడటం కోసం.. జనం లేక ఊరు వల్లకాడులా కనిపించింది. దీంతో పల్లెకు మళ్లీ ప్రాణం పోయాలనుకుంది. వినూత్నంగా తన నిరసనను తెలుపుతూ.. ఊరును మళ్లీ ‘జనం’తో నింపాలనుకుంది. అలా మొదలైంది.. ఈ బొమ్మల కథ.. ఆ ఊరులో చనిపోయినవారు లేదా ఆ ఊరు విడిచిపోయినవారి పేరిట బొమ్మలను తయారుచేయడం ప్రారంభించింది. బెస్తవారైతే ఆ లెక్కన.. వ్యవసాయదారుడైతే ఆ తరహాలో.. బొమ్మలను రూపొందించింది. అంటే.. ఆ ఊరిలో చనిపోయిన లేదా విడిచివెళ్లిన ప్రతి ఒక్కరి పేరు మీద బొమ్మలున్నాయన్నమాట.

వారు విడిచివెళ్లిన ఇళ్ల వద్ద వారు ఉన్నట్లుగానే భ్రమింపజేసేలా ఆ బొమ్మలను తయారుచేసి.. అక్కడే పెట్టింది. అంటే ఆ ఊరి వారు ఇంకా అక్కడే ఉన్నట్లుగా.. జనం లేక వల్లకాడులాగ మారుతున్న పల్లెల సమస్యను తెలియజేయడానికి తానిలా చేస్తున్నట్లు టకుమి తెలిపారు.  పైగా.. దీని వల్ల పదిమందితో కలిసి ఉంటున్నామన్న భావన కూడా కలుగుతుందని చెప్పారు. ఇది పదిమందిని ఆకర్షించింది. ఆ ఊరు చిన్నసైజు పర్యాటక ప్రదేశంగా మారిపోయింది. జపాన్‌లో దాదాపు 10 వేల ఊళ్లు ఇలాంటి ఇబ్బందిని ఎదుర్కొంటున్నాయట. ఇప్పుడిప్పుడే వేరే గ్రామాల్లోనూ ఇలాంటి బొమ్మల నిరసన మొదలవుతోందట.   

మరిన్ని వార్తలు