అమెరికాలో ట్రక్‌ టెర్రర్‌

2 Nov, 2017 01:56 IST|Sakshi
ఉగ్రదాడి అనంతరం చెల్లాచెదురుగా పడిఉన్న సైకిళ్లు (ఇన్‌సెట్‌లో) ఉగ్రవాది సైఫుల్లా

న్యూయార్క్‌లో పాదచారులు, సైక్లిస్టులపైకి ట్రక్కుతో దూసుకెళ్లిన ఉన్మాది 

8 మంది మృతి 

మోదీ సహా వివిధ దేశాధినేతల దిగ్భ్రాంతి  

ఉలిక్కిపడిన అగ్రరాజ్యం

వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ సమీపంలో దుశ్చర్య

విదేశీయులపై తనిఖీలు కఠినతరం చేయాలని ట్రంప్‌ ఆదేశం

న్యూయార్క్‌: అమెరికాలో మళ్లీ ఉగ్రదాడి జరిగింది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉగ్రదాడుల తరహాలోనే.. న్యూయార్క్‌లో ఓ ఉన్మాది ట్రక్కుతో పాదచారులపైకి దూసుకుపోయాడు. 9/11 నాటి దాడులకు కేంద్రమైన వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ సమీపంలోనే ఉగ్రవాది ట్రక్కుతో దూసుకురావటంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 11 మందికి గాయాలయ్యాయి. ఉజ్బెకిస్తాన్‌కు చెందిన సైఫుల్లా హబీబుల్లాయ్‌విక్‌ సైపోవ్‌ (29) అనే ఉగ్రవాది ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపి.. ఆ ఉన్మాదిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో న్యూయార్క్‌తోపాటుగా అమెరికా ఉలిక్కిపడింది. ఈ ఘటనను ఉగ్రదాడిగానే భావిస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా వివిధ దేశాధినేతలు తీవ్రంగా ఖండించారు. ఈ ఉన్మాది 2010లో డైవర్సిటీ లాటరీ ప్రోగ్రామ్‌ ద్వారా అమెరికాకు వలస వచ్చినట్లు తెలిసింది.  

కడుపులో బుల్లెట్‌ తగలడంతో కుప్పకూలిన ఉగ్రవాదిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు 

ఎలా జరిగింది? 
మంగళవారం రాత్రి హాలోవీన్‌ సంబరాలకోసం న్యూయార్క్‌ సిద్ధమవుతోంది. మన్‌హాటన్‌ పశ్చిమభాగంలోని హడ్సన్‌ నది సమీపంలో (వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ దగ్గరలో)ని హైవే వద్ద మార్కెట్‌ రద్దీగా ఉంది. సైకిల్‌ లేన్, పాదచారుల లేన్‌కూడా రద్దీగా ఉంది. మధ్యాహ్నం 03.04 గంటల (స్థానిక కాలమానం) సమయంలో ఓ ట్రక్కు హైవే నుంచి వేగంగా ఈ రెండు లేన్ల వైపు దూసుకొచ్చింది. ట్రక్కు నడుపుతున్న ఐసిస్‌ ఉగ్రవాది ‘అల్లాహు అక్బర్‌’ అని గట్టిగా అరుస్తూ ట్రక్కును వేగంగా పోనిచ్చాడు. దీంతో కొందరు ట్రక్కు కింద చిక్కుకుపోగా.. ప్రమాదాన్ని గుర్తించిన వారు సైకిళ్లు వదిలి పారిపోయారు. ట్రక్కు త్రీలైన్డ్‌ సైకిల్‌ లేన్‌లో ఆగకుండా దాదాపు అరకిలోమీటర్‌ వరకు సైకిళ్లు, ద్విచక్ర వాహనాలపై దూసుకుపోయింది. దీంతో రోడ్డు పొడుగునా రక్తపు మరకలు భయానకంగా కనిపించాయి.

ట్రక్కుతో పార్కింగ్‌లో ఉన్న స్కూలు బస్సును ఢీకొట్టి ఇద్దరు చిన్నారులు సహా పలువురు
యువకులను గాయపరిచిన ఉన్మాది.. డమ్మీ తుపాకీ పట్టుకుని ట్రక్కునుంచి బయటకు దిగాడు. అప్రమత్తమైన పోలీసులు అతని కడుపులో కాల్చారు. దీంతో ఉన్మాది సైఫుల్లా కుప్పకూలిపోయాడు. ఆరుగురు ట్రక్కు వేగానికి సైకిల్‌ లేన్‌లోనే చనిపోగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఐదుగురు అర్జెంటీనా వాసులు, ఓ బెల్జియన్‌ ఉన్నారు. మరో ఇద్దరి గుర్తింపు తెలియలేదని పోలీసులు తెలిపారు. గాయాలతో ఉన్న సైఫుల్లాను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనకు ఆసుపత్రిలో చికిత్సనందిస్తున్నారు. ఆపరేషన్‌కు ముందే ఉగ్రవాదితో మాట్లాడేందుకు పోలీసులు ప్రయత్నించినట్లు సమాచారం.  

విదేశీయులపై తనిఖీలు కఠినతరం: ట్రంప్‌ 
ఈ ఘటనను ఉగ్రవాదుల పిరికిపంద చర్యగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభివర్ణించారు. ‘పశ్చిమాసియాలో మరోచోట ఐసిస్‌ ఉగ్రవాదులను ఓడిస్తున్నాం. అది చాలు. వారిని మన దేశంలోకి రానివ్వం’ అని ట్వీటర్‌లో పేర్కొన్నారు. ‘న్యూయార్క్‌లో ఓ మానసిక ఉన్మాది మళ్లీ దారుణానికి ఒడిగట్టాడు. అధికారులు ఈ ఘటనను పరిశీలిస్తున్నారు’ అని ట్వీట్‌ చేశారు. అమెరికాకు వస్తున్న విదేశీయుల గత చరిత్రను, ఇతర వివరాలను తనిఖీ చేసే ప్రక్రియను మరింత కఠినంగా జరపాలని ఆదేశించారు. మరింత కఠినంగా తనిఖీ చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఘటనకు సంతాప సూచకంగా తన ట్వీటర్‌ అకౌంట్‌ బ్యానర్‌ను ‘న్యూయార్క్‌ స్కైలైన్‌’ అని మార్చారు. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ఒక ప్రకటనలో ట్రంప్‌ తెలిపారు. ఉగ్రదాడి నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాట్లాడుతూ గ్రీన్‌ కార్డు లాటరీ విధానాన్ని రద్దు చేస్తానని అన్నారు. ‘ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ఐసిస్‌ ఉగ్రవాది సైఫుల్లా డైవర్సిటీ లాటరీ విధానం ద్వారా అమెరికాకు వచ్చాడు. ఈ విధానాన్ని రద్దు చేసే ప్రక్రియను నేను ప్రారంభించబోతున్నాను’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ ఘటనను ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సోనియా గాంధీ ఖండించారు. కాగా, బాధితుల్లో భారతీయులెవరూ లేరని అమెరికాలోని భారత దౌత్యకార్యాలయం తెలిపింది.

సైఫుల్లా నేరచరితుడే 
‘హైవే నుంచి ఓ ట్రక్కు వేగంగా పాదచారులు, సైక్లిస్టుల లేన్‌లోకి దూసుకురావటం చూశాను. అదే వేగంగా చాలా మందిని ఈ ట్రక్కు ఢీకొంది. 9–10 సార్లు కాల్చిన శబ్దం కూడా వినిపించింది’ అని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ‘అల్లాహు అక్బర్‌’ అని గట్టిగా అరుస్తూ ట్రక్కును వేగంగా పోనిచ్చాడని పలువురు తెలిపారు. ట్రక్కులో దొరికిన ఓ నోట్‌లోనూ ఐసిస్‌కు సంబంధించిన వివరాలున్నాయని తెలిసింది. పెల్లెట్‌ గన్, పెయింట్‌ బాల్‌ గన్‌లను కూడా ఘటనాస్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు. 11 మందికి గాయాలయ్యాయన్న న్యూయార్క్‌ ఫైర్‌ కమిషనర్‌.. వారందరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డట్టేనని పేర్కొన్నారు. ఘటనకు పాల్పడిన ఉన్మాది న్యూజెర్సీలోని పాటర్‌సన్‌ నుంచి వచ్చాడని తెలిసింది. మిస్సోరి, పెన్సిల్వేనియాల్లో ట్రాఫిక్‌ ఉల్లంఘనకు పాల్పడినట్లుగా సైఫుల్లాపై అభియోగాలు కూడా ఉన్నాయి.  

మృతదేహాలున్న ఘటనాస్థలి వద్ద దర్యాప్తు చేపట్టిన ఫోరెన్సిక్‌ నిపుణులు  

వేడుకలకొస్తే విషాదం వెక్కిరించింది 
వారంతా చిన్నతనం నుంచి స్నేహితులు. అర్జెంటీనాలోని రోజారియో పట్టణంలో పాలిటెక్నిక్‌ కలిసే చదువుకున్నారు. వీరంతా గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పదిమంది మిత్రులు న్యూయార్క్‌లో సంబరాలు జరుపుకోవాలనుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం వీరంతా కలిసిన సమయంలోనే ఉగ్రవాది సైఫుల్లా ట్రక్‌తో దూసుకొచ్చాడు. దీంతో వీరిలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో హెర్న్‌ మెండోజా, డీగో ఎన్రిక్, డామిన్‌ పాంగ్నుకో, ఏరియల్‌ ఎర్లిజ్, హెర్న్‌ ఫెర్రూచీలు మృతిచెందినట్లు అమెరికాలోని అర్జెంటీనా రాయబార కార్యాలయం ప్రకటించింది. ఉగ్రదాడితో మిగిలిన మిత్రులంతా షాక్‌కు గురయ్యారు. న్యూయార్క్‌కు రాకముందు వీరంతా లిబ్రె (స్వేచ్ఛ) అని రాసున్న టీ–షర్ట్‌లో దిగిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. మృతుల్లో ఒకరైన ఎర్లిజ్‌.. న్యూయార్క్‌ టూర్‌కోసం ఆర్థికంగా ఇబ్బందులున్న ఇద్దరు మిత్రుల ఖర్చులను తానే భరించారు.  

మరిన్ని వార్తలు