కాంక్రీట్‌ వద్దు.. స్టీల్‌

7 Jan, 2019 04:30 IST|Sakshi

గోడ కడదాం: ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికా–మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణంపై మొండిగా వ్యవహరిస్తున్న అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మెత్తబడ్డారు. అక్రమ వలసదారుల్ని అడ్డుకునేందుకు సరిహద్దులో కాంక్రీట్‌ గోడ కాకపోయినా స్టీల్‌తో గోడలాంటి నిర్మాణాన్ని చేపట్టాలని వ్యాఖ్యానించారు. అక్రమవలసదారుల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్రంగా నష్టం జరుగుతోందని వాపోయారు. స్టీల్‌ గోడలాంటి నిర్మాణంపై చర్చించేందుకు అమెరికా ఉక్కు పరిశ్రమ సంఘం అధ్యక్షుడితో పాటు ముఖ్యులతో సమావేశమవుతానని తెలిపారు.

గోడ కారణంగా అక్రమ వలసలతో పాటు మాదకద్రవ్యాల సరఫరాను అడ్డుకోవచ్చనీ, తద్వారా నేరాలు తగ్గుముఖం పడతాయని వెల్లడించారు. ఆదివారం వైట్‌హౌస్‌ నుంచి క్యాంప్‌ డేవిడ్‌కు బయలుదేరిన సందర్భంగా ట్రంప్‌ మీడియాతో మాట్లాడారు. దాదాపు 3 వారాలుగా కొనసాగుతున్న షట్‌డౌన్‌ సుదీర్ఘకాలం కొనసాగుతుందని ట్రంప్‌ పునరుద్ఘాటించారు. గోడ నిర్మాణం విషయమై ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ, మైనారిటీ నేతల చక్‌ కలిసివస్తే 20 నిమిషాల్లో సమస్య పరిష్కారమైపోతుందని స్పష్టం చేశారు. షట్‌డౌన్‌కు వీరిద్దరే కారణమని ఆరోపించారు.

మరిన్ని వార్తలు