25 పెళ్లిళ్లు.. 146 మంది పిల్లలు..

26 Jul, 2017 07:38 IST|Sakshi
25 పెళ్లిళ్లు.. 146 మంది పిల్లలు..

కెనడాలో ఓ మాజీ మత పెద్ద చేసిన నిర్వాకమిది. గత 25 ఏళ్లలో ఏడాదికి ఒకటి చొప్పున ఆయన పాతిక పెళ్లిళ్లు చేసుకున్నాడు. అంతేకాదు ఏడాదికి ఇద్దరు ముగ్గురు సంతానాన్ని కూడా పొందాడు. అలా ఆయన సంతానం సంఖ్య 25 ఏళ్లలో 146 అయింది.

బహుభార్యత్వం కేసులో ప్రస్తుతం ఐదేళ్ల జైలుశిక్షను ఎదుర్కొంటున్న ఆయన పేరు విన్‌స్టన్‌ బ్లాక్‌మోర్‌. వయసు 61 ఏళ్లు. కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియా ప్రావిన్సులోగల బౌంటిఫుల్‌ అనే ప్రాంతంలో ప్రత్యేక వర్గ ప్రజలు నివసిస్తుంటారు. వారిలో ఒకరైన విన్‌స్టన్‌ 1990 నుంచి ఇప్పటివరకు 25 మంది మహిళలను పెళ్లి చేసుకున్నాడు.

వారితో కాపురం చేసి 146 మంది పిల్లల్ని కన్నాడు. వాస్తవానికి 1990ల్లోనే విన్‌స్టన్‌ బహుభార్యత్వంపై ఆరోపణలు వచ్చాయి. అయితే, బహుభార్యత్వానికి సంబంధించి కెనడా చట్టాల్లో ఉన్న లొసుగులతో విన్‌స్టన్‌ విచారణ, శిక్షల నుంచి తప్పించుకుంటూ వచ్చాడు. అయితే, 2011లో కెనడాలో బహుభార్యత్వాన్ని ఆ దేశ న్యాయస్థానం నిషేధించింది.

ఆ తర్వాత కూడా విన్‌స్టన్‌ వివాహాలు చేసుకుంటూనే ఉన్నాడు. దీంతో ఆయన మాజీ భార్య ఒకరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసును విచారించిన బ్రిటిష్‌ కొలంబియా సుప్రీంకోర్టు జస్టిస్‌ షెరీ ఆన్‌ డొనెగాన్‌.. విన్‌స్టన్‌కు ఐదేళ్ల కారాగార శిక్ష విధించారు. విన్‌స్టన్‌తో పాటు మరో బహుభార్యత్వం కేసును కూడా కోర్టు విచారించింది. జేమ్స్‌ ఓలర్‌(53) అనే వ్యక్తిని  కోర్టు దోషిగా తేల్చింది. ఓలర్‌కు ఐదుగురు భార్యలున్నారు. అయితే, అతనికి ఇంకా శిక్ష ఖరారు కావాల్సివుంది. పాతిక వివాహాలు చేసుకోవడంపై విన్‌స్టన్‌ స్పందిస్తూ.. భగవంతుడి ఆదేశాల మేరకే తాను అన్ని పెళ్లిలు చేసుకున్నానని చెప్పాడు.

మరిన్ని వార్తలు