ట్రంప్‌పై బిలియనీర్‌ పోరాటం..

22 Oct, 2017 09:53 IST|Sakshi

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభిశంసన కోసం ఆ దేశ బిలియనీర్‌ ఒకరు పోరాటాన్ని ప్రారంభించారు. ట్రంప్‌ను వెంటనే అధ్యక్ష పదవి నుంచి దింపేయాలని అమెరికన్‌ కాంగ్రెస్‌ (చట్టసభ) సభ్యుల కోరుతూ టీవీల్లో, ఆన్‌లైన్‌లో ప్రచారాన్ని మొదలుపెట్టారు.

మాజీ హెడ్జ్‌ ఫండ్ మేనేజర్‌, బిలియనీర్‌ అయిన టామ్‌ స్టేయర్‌ ఈమేరకు టీవీల్లో, ఆన్‌లైన్‌లో వాణిజ్య ప్రకటనలు ఇచ్చారు. ట్రంప్‌ను ఎందుకు అభిశంసించాలో కారణాలు ఈ వాణిజ్య ప్రకటనలో ఆయన వివరించారు. 'ఆయన అణ్వాయుధ యుద్ధం వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. ఎఫ్‌బీఐతో అన్యాయంగా ప్రవర్తించారు. విదేశీ ప్రభుత్వాల నుంచి డబ్బు తీసుకున్నారు. నిజాన్ని ప్రచురించినందుకు వార్తాసంస్థలను మూసివేస్తానని హెచ్చరించారు' అని స్టేయర్‌ తన వాణిజ్య ప్రకటనలో పేర్కొన్నారు.

అణ్వాయుధాలు కలిగి.. మానసికంగా స్థిరచిత్తం లేని అధ్యక్షుడు దేశానికి ప్రమాదకరం అని తెలిసినా కాంగ్రెస్ చట్టసభ సభ్యులు ఏమీ పట్టపట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ వాణిజ్య ప్రకటన కోసం టామ్‌ స్టేయర్‌ 10 మిలియన్‌ డాలర్లు ఖర్చు పెట్టారు. ఈ ప్రకటన చూసిన ప్రజలు ఉమ్మడిగా తమ గళాన్ని వినిపించడం ద్వారా కాంగ్రెస్‌ సభ్యులపై ఒత్తిడి తేవాలని, ఇప్పటికైనా కాంగ్రెస్‌ సభ్యులు రాజకీయాలు మాని.. దేశం కోసం పనిచేసేలా చూడాలని సూచించారు. అంతేకాకుండా ఆయన 'నీడ్‌టుఇంపీచ్‌' పేరిట ఆన్‌లైన్‌లో సంతకాలు సేకరించేందుకు వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. స్టేయర్‌ ప్రతిపక్ష డెమొక్రటిక్‌ పార్టీ కార్యకర్త. 2012లో ఒబామాకు ఫండ్‌రైజర్‌గా ఆయన కీలకంగా వ్యవహరించారు.

మరిన్ని వార్తలు