సయీద్‌పై అమెరికా కన్నెర్ర

20 Jan, 2018 00:45 IST|Sakshi

సయీద్‌పై విచారణ జరగాల్సిందే..

పాక్‌ ప్రధాని వ్యాఖ్యలపై మండిపాటు

వాషింగ్టన్‌: ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, ఉగ్రసంస్థ జమాతుద్‌ దవా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేసిన పాక్‌ ప్రధాని వ్యాఖ్యలపై అమెరికా మండిపడింది. సయీద్‌ ఉగ్రవాదేనని స్పష్టం చేసిన అమెరికా.. చట్టప్రకారం అతనిపై అభియోగాలు మోపి పూర్తిస్థాయి విచారణ జరపాల్సిందేనంది. ‘ భద్రతామండలి ఉగ్రవాదుల జాబితాలో సయీద్‌ పేరుంది. 2008 ముంబై దాడుల్లో సయీద్‌ పాత్ర కీలకమని మేం విశ్వసిస్తున్నాం.

జమాతుద్‌ దవా (జేయూడీ) లష్కరే సంస్థలో భాగమే. గృహనిర్బంధం నుంచి సయీద్‌ను విడుదల చేయటంపై పాక్‌ ప్రభుత్వానికి నిరసనను స్పష్టంగా తెలియజేశాం’ అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హీతర్‌ నార్ట్‌ చెప్పారు. గురువారం ప్రముఖ పాకిస్తాన్‌ చానెల్‌ జియో టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాక్‌ ప్రధాని అబ్బాసీ..  సయీద్‌ను ‘సాబ్, సర్‌’ అని సంబోధించారు.

‘పాక్‌లో సయీద్‌ సర్‌పై కేసుల్లేవు’ అని అన్నారు. సయీద్‌పై చర్యలు తీసుకోవటంలో పాకిస్తాన్‌ చిత్తశుద్ధిని చాటుకోవాలని భారత్‌ సూచించింది. పసలేని కారణాలు చూపుతూ తప్పించుకునే ప్రయత్నాలను మానుకోవాలని పేర్కొంది. సయీద్‌పై అభియోగాలు మోపాలంటూ అమెరికా వ్యాఖ్యానించిన నేపథ్యంలో భారత్‌ ఈ విధంగా స్పందించింది.

మరిన్ని వార్తలు