పుతిన్ను కలవరపెడుతున్న ఆర్థిక సంక్షోభం

17 Dec, 2015 17:30 IST|Sakshi
పుతిన్ను కలవరపెడుతున్న ఆర్థిక సంక్షోభం

మాస్కో: దేశంలో ఆర్థిక వృద్ధి నిరాశాజనకంగా ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. మాస్కోలో బుధవారం సాయంత్రం వార్షిక న్యూస్  కాన్ఫరెన్స్ కార్యక్రమంలో కీలక ప్రసంగం చేసిన ఆయన.. దేశంలో ఆర్థిక సంక్షోభం తారా స్థాయికి చేరుకుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు పతనం కావడం మూలంగా రష్యా ఆర్ధిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితం అయినట్లు వెల్లడించారు.

'మన దేశ ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా ఆయిల్, గ్యాస్ ధరలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర కనీసం 100 డాలర్లుగా ఉంటే మంచి ఫలితాలు ఉండేవి. ప్రస్తుతం బ్యారెల్ చమురు ధర 50 డాలర్లకు పడిపోవడం తీవ్రంగా ప్రభావితం చూపుతోంది. ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల పైన మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది' అని పుతిన్ అన్నారు.

ఆయిల్ ధరలు పతనమైనప్పటికీ వస్తు తయారీ, వ్యవసాయ రంగాల్లో ఆరోగ్యకరమైన వృద్ధి నమోదైనట్లు పుతిన్ తెలిపారు. సిరియాలో రష్యా దాడుల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడి వార్షిక ప్రసంగం ప్రాధాన్యతను సంతరించుకుంది. మూడో సారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన పుతిన్ను ఆర్థిక సంక్షోభం కలవరపెడుతోంది.
 

మరిన్ని వార్తలు