గ్రీన్‌ల్యాండ్‌ కరిగిపోతే ఏమవుతుంది?

15 Sep, 2016 18:47 IST|Sakshi
గ్రీన్‌ల్యాండ్‌ కరిగిపోతే ఏమవుతుంది?

గ్రీన్‌ల్యాండ్‌ ప్రపంచంలోనే అతిపెద్ద దీవి. ఏడాదిలో ఎక్కువకాలం తెల్లటి మంచు పొరలతో తళతళ మెరిసిపోతుంది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఆ దీవిలో ఏడాదికి 350 గిగా టన్నుల మంచు కరిగిపోతోంది. దానిలో సగభాగం మంచు కరగిపోవడం వల్ల మరో సగభాగం మంచుకొండలు సముద్రంలోకి కుంగిపోవడం వల్ల జరుగుతోంది. 1990 నుంచి 2000 వరకు మంచు కరగడం, కూడుకోవడం మధ్య సమతౌల్యత ఉండేది. అంటే ఏడాదికి ఎంత మంచు కూడుతుందో అంతే మంచు కరిగిపోయేది. 2000 సంవత్సరం నుంచి ట్రెండ్‌ మారిపోయింది. అంటే కూడుతున్న మంచుకన్నా కరగిపోతున్న మంచే ఎక్కువగా ఉంటోంది.

సాధారణంగా మంచు కూడుకోవడం శీతాకాలంలో జరుగుతుంది. కరగిపోవడం వేసవిలో జరుగుతుంది. ఎప్పుడూ గ్రీన్‌ల్యాండ్‌లో మంచు కరగిపోవడం మే నెలలో ప్రారంభమయ్యేది. ఈసారి ఏప్రిల్‌ లోనే ప్రారంభమైంది. ఎప్పుడూ ఏప్రిల్‌ నెలలో అక్కడ ఉష్ణోగ్రత మైనస్‌ 20 డిగ్రీలు ఉండగా, ఈసారి జీరో డిగ్రీలు మాత్రమే ఉంది. ఆర్కిటిక్‌లోని ఆల్ప్స్ మంచు పర్వతాల కన్నా ఆరు రెట్లు వేగంగా అక్కడి మంచు కరగుతోంది. కరగుతున్న మంచును రెండు రకాలుగా కొలుస్తారు. ఒకటి గ్రేస్‌ శాటిలైట్‌ ద్వారా మంచు కరగుతున్న శాతాన్ని అంచనావేస్తారు. సముద్రంలో కలుస్తున్న మంచు ఫలకల మందాన్ని నాసా శాస్త్రవేత్తలు తమ శాటిలైట్‌ ద్వారా కనుగొని సముద్రంలో కలుస్తున్న మంచు శాతాన్ని అంచనావేస్తారు.

వచ్చే ఏడాది గ్రీన్‌ల్యాండ్‌లో మరింత వేగంగా మంచు కరగిపోతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రెండు రకాలుగా అది వేగవంతం అవుతుంది. 2030 నాటికి భూతాపోన్నతి రెండు డిగ్రీల సెల్సియస్‌ పెరగడం వల్ల మంచు కరిగితే ఇప్పటికే మంచు ఫలకల కరగి పలుచబడడం పర్యవసానంగా సూర్య కిరణాల నుంచి ఎక్కువ వేడి వేడి ఎక్కువగా తగిలి మంచు కరగే ప్రక్రియ వేగవంతమవుతుంది.  మంచు ఫలకలు మందంగా ఉండడం వల్ల సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు వెనక్కి ప్రతిఫలించి విశ్వంలో కలసిపోతాయి. మంచు తరిగిపోవడం వల్ల, మంచ పలకలు పలచబడడం వల్ల సూర్యకిరణాలు మంచు పొరల్లోకి చొచ్చుకుపోయి వేడి ఎక్కువగా తగులుతుంది.

మంచు కరిగితే కలిగే నష్టం ఏమిటీ?
గ్రీన్‌ల్యాండ్‌లోని మంచంతా కరిగి సముద్రంలో కలిస్తే భూగోళంపైనున్న సముద్రాల మట్టాలు ఆరు మీటర్లు పెరుగుతాయి. ఫలితంగా భారత్‌లోని ముంబై, కోల్‌కతా నగరాలతోపాటు షాంఘై, తియాంజిన్, హాంకాంగ్, ఢాకా, జకార్త, తాయ్‌జౌ నగరాలు దాదాపు సగం సముద్రంలో మునిగిపోతాయి. ఆయా నగరాల్లో నివసిస్తున్న 13 కోట్ల మంది ప్రజలపై చొచ్చుకువచ్చే సముద్రాల ప్రభావం ఉంటుంది. మంచు కరగుతున్న శాతాన్ని వారం వారం రికార్డు చేసేందుకు ఇప్పుడక్కడ ఓ ఆటోమేటిక్‌ లాబరేటరీని ఏర్పాటు చేశారు.

>
మరిన్ని వార్తలు