దాడికి ఆ చోటే ఎందుకు ఎంచుకున్నారో?

3 Dec, 2015 07:33 IST|Sakshi
దాడికి ఆ చోటే ఎందుకు ఎంచుకున్నారో?

సాధారణంగా ఎప్పుడూ జనసంద్రం ఎక్కువగా ఉండే ప్రాంతాలను మాత్రమే లక్ష్యంగా ఎంచుకునే ఉగ్రవాదులు ఈసారి ఎంతో ప్రశాంతమైన ప్రాంతాన్ని ఎంచుకున్నారని అమెరికా నిఘా వర్గాలు ఆలోచిస్తున్నాయి. పెద్ద పెద్ద టవర్స్, షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, సినిమా థియేటర్స్ను లక్ష్యంగా ఎంచుకునే ఉగ్రవాదులు నిర్మలంగా ఉండే శాన్ బెర్నార్డియో ప్రాంతాన్ని ఎంచుకోవడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటని బుర్రలు బద్దలుకొట్టుకుంటున్నాయి. ఇటీవల ఫ్రాన్స్పై దాడి అనంతరం వైట్ హౌస్ పై కూడా దాడి చేస్తామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే.

అప్పటి నుంచి ప్రముఖ అధికారిక నివాసాలతోపాటు ఇతర ప్రాంతాల్లో కూడా భారీ స్థాయిలో అమెరికా భద్రతను మోహరించింది. తాజాగా కాల్పులు జరగిన క్షణాల్లోనే దాదాపు 1300 మంది పోలీసులు కాల్పులకు తెగబడినవారికోసం వీధుల్లో గాలింపులు మొదలుపెట్టారంటే భద్రత విషయంలో అమెరికా ఎంత అప్రమత్తంగా ఉందో అర్థమవుతుంది. సాధారణంగా శాన్ బెర్నార్డియోలో దాదాపు చికిత్స కేంద్రాలు ఎక్కువ. అందులో మానసిక వికలాంగులకు శిక్షణ ఇచ్చేవాటివే అగ్రస్థానం. అక్కడ హడావిడిగాని అలజడిగానీ ఉండదు. దాదాపు 80శాతం మంది మానసిక రోగులు అక్కడ చికిత్స పొందుతుంటారు. అలాంటి ప్రాంతంలోకి ఒక బ్లాక్ ఎస్వీయూలో మిలటరీ దుస్తుల్లో వచ్చిన ముగ్గురు దుండగులు వచ్చిరాగానే విచ్చలవిడిగా కాల్పులు జరిపారు.

ఈ కాల్పుల వల్ల 14మంది చనిపోయినట్లు చెబుతున్నా అధికారికంగా మాత్రం ఎక్కువమంది చనిపోయినట్లు సమాచారం. 20మందికి పైగా గాయాలపాలయ్యారు కూడా. అయితే, దాడికి పాల్పడింది ఎవరనే విషయం మాత్రం ఇంకా స్పష్టం కాలేదు. ఒక వేళ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ కు చెందిన వారే ఈ దాడికి పాల్పడితే పోలీసుల అప్రమత్తతను పక్కదారి పట్టించి భవిష్యత్తులో అనూహ్యంగా ఎక్కడైనా జరుపుతామని పరోక్షంగా హెచ్చరించేందుకు తాజా కాల్పులను జరిపి చూపించిందా అనేది కొంత అనుమానించాల్సిన విషయమే.

మరిన్ని వార్తలు