చైనాలో కిమ్‌ రహస్య పర్యటన..!

28 Mar, 2018 03:40 IST|Sakshi

బీజింగ్‌ : ఉత్తర కొరియా అధ్యక్షుడు  కిమ్‌ జోంగ్‌ ఉన్‌ చైనాలో పర్యటిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. సోమవారం కిమ్‌ రహస్యంగా చైనాలో పర్యటించడానేది ఆ వార్తల సారంశం. కిమ్‌ పర్యటనపై  ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. కిమ్‌ ఎవరితో బేటీ కానున్నాడు, ఏయే అంశాలపై చర్చించనున్నాడనేది ఆసక్తిగా మారింది. దీనిపై అటూ చైనా నుంచి గానీ, ఉత్తర కొరియా నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ కిమ్‌ చైనా పర్యటన వాస్తవమైన పక్షంలో 2011లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన తొలి విదేశీ పర్యటన ఇదే అవుతుంది. చైనా, నార్త్‌ కొరియా బార్డర్‌లో బలగాలను మోహరించడం, బీజింగ్‌లోని ప్రముఖ హోటల్‌ వద్ధ భద్రత ఏర్పాట్లు చేపట్టడం ఈ వార్తలకు బలం చేకూర్చుతున్నాయి.

చాలా కాలంగా అమెరికా, ఉత్తర కొరియాల మధ్య  న్యూక్లియర్‌ క్షిపణుల అంశంలో వివాదం పరిష్కారం దిశగా సాగుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా మేలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, కిమ్‌ మధ్య భేటీ జరగనుంది. ఈ నేపథ్యంలో కిమ్‌ చైనా పర్యటనపై వార్తలు పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. చాలా కాలం నుంచి ఉత్తర కొరియా, చైనాకు మిత్ర దేశంగా ఉంది. కిమ్‌ తండ్రి చనిపోక ముందు చాలా సార్లు రహస్యంగా చైనా పర్యటన చేపట్టారు.

మరిన్ని వార్తలు