పిల్లితో భారీ వ్యాపారం!

26 Jul, 2016 20:31 IST|Sakshi
పిల్లితో భారీ వ్యాపారం!

జపాన్ః వ్యాపారాభి వృద్ధికోసం ఒక్కొక్కరు ఒక్కో టెక్నిక్ ఉపయోగిస్తారు. ముఖ్యంగా జనాన్ని ఆకట్టుకోడానికి రకరకాల ఎత్తులు వేస్తుంటారు. కొందరు మాటలతోనే కొనుగోలుదారులను ఆకట్టుకోడానికి చూస్తే.. మరికొందరు డెకరేషన్లు,లైటింగ్ లు వంటి అనేక రకాల ఆకర్షణలను ఎర వేస్తుటారు. అయితే జపాన్ లో మాత్రం ఓ పిల్లి..తనదైన శైలిలో చిన్నారులను ఆకట్టుకుంటూ.. తన వ్యాపారాన్ని చలాకీగా సాగించేస్తోంది. పిల్లి వ్యాపారం చేయడమేమిటా అని ఆశ్చర్యపోతున్నారా?

అమెరికాలో అందరూ ఇష్టపడే హాట్ డాగ్స్..., సింగపూర్ లో వేడినుంచీ ఉపశమనాన్నిచ్చే ఐస్ క్రీమ్స్ లాగానే... జపాన్ లో జనం యాకీ ఇమో (రోస్టెడ్ స్వీట్ పొటాటో) ను అమితంగా ఇష్టపడతారు. ముఖ్యంగా చలికాలంలో ఈ యాకీ ఇమో అమ్మకాలు భారీగా జరిపేందుకు టొట్టోరి ప్రిఫిక్చర్, కురాయోషి నగరంలో ఓ లెజెండరీ క్యాట్ రంగంలోకి దిగింది. జనం ఎంతో ఇష్టంగా తినే ఐటెమ్ అయినా వ్యాపారానికి మాత్రం పోటీ తప్పదు కదా. అందుకే ఇక్కడ యాకీ ఇమో వ్యాపారి తనదైన శైలిలో పిల్లలను ఆకట్టుకునేందుకు ఓ అందమైన పిల్లిని ఆయుధంగా చేసుకున్నాడు. పిల్లిలాటి కోటును ధరించి పిల్లలను ఆకట్టుకుంటూ చలాకీగా అమ్మకాలు జరిపేయడమే కాదు... వారితో కలసి సెల్ఫీలు, ఫోటోలు తీయించుకుంటూ హుషారుగా వ్యాపారం చేసేస్తున్నాడు.


బొమ్మలంటే చిన్నారులు ఎంతో ఇష్టపడతారన్న ఉద్దేశ్యంతో తన వ్యాపారాభివృద్ధికి 'మికెనెకో యమాడా'.. ఈ కొత్త ప్రయోగాన్ని ప్రవేశ పెట్టాడు. దీంతో పిల్లలంతా యమాడా రోస్టింగ్ స్టాండ్ దగ్గరకు పరుగులు తీస్తున్నారు. యాకీ ఇమోలను తినడంకన్నా పిల్లి బొమ్మను ఇష్టంగా చూస్తూ షేక్ హ్యాండ్ లు, హాయ్.. బాయ్.. లు చెప్తున్నారు. ఇలా వినూత్న తరహాలో అమ్మకాలను పెంచుకుంటున్న మికెనెకో ఆధునిక పరిజ్ఞానాన్ని సైతం వినియోగించుకొని తాను ఏరోజు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడో ముందుగానే ట్వీట్ చేస్తున్నాడు.  

వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే జపాన్ వీధులు యాకీ ఇమోల వ్యాపారులతో కళకళ్ళాడుతాయి. ముఖ్యంగా వాతావరణం చల్లగా ఉన్న సమయంలో ఇండియాలో మిర్చి బజ్జీలు, నిప్పుల్లో కాల్చిన జొన్న కండెలు తిన్నట్లుగా అక్కడి జనం..  గులకరాళ్ళపై రోస్ట్ చేసే స్వీట్ పొటాటోలను ఎంతో ఇష్టంగా తింటారు. అయితే కొందరు ఈ యాకీ ఇమోలను రాలిన ఆకుల మంటతోనూ, బొగ్గులపైనా కూడా రోస్ట్ చేస్తుంటారు. వేగంగా పని అయిపోవాలనుకునే మరి కొందరు రోస్ట్ చేసేందుకు  మైక్రోవేవ్ ను కూడా వినియోగిస్తారు. కానీ అన్నింటికంటే గులకరాళ్ళపై రోస్ట్ చేసే వాటినే జపాన్ జనం ఎక్కువగా ఇష్టపడతారు. మరి కొనుగోలుదారులను ఆకట్టుకొనేందుకు ఇతర దేశాలవారూ ఇలాంటి ప్రయత్నాలు మొదలు పెట్టొచ్చేమో చూడండి..!

మరిన్ని వార్తలు