లే‘ఔట్‌’పై దృష్టి 

12 Feb, 2018 15:20 IST|Sakshi

ఇష్టారాజ్య అనుమతులు,  అక్రమ లే అవుట్లపై ఏసీబీ నిఘా

ఖమ్మం : అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఖమ్మం నగరంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పేరిట అక్రమ లే అవుట్లు, నిబంధనలకు విరుద్ధంగా కొందరు అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలతో..బాధ్యులపై చర్యలకు అవినీతి నిరోధక శాఖ ( ఏసీబీ) అధికారులు నిఘా పెట్టారు. రాష్ట్రంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఖమ్మంలో ఒక వైపు సుడా ఏర్పాటు మరోవైపు ఐటీహబ్‌.. ఔటర్‌ రింగ్‌రోడ్‌ ఏర్పాట్లతో అక్రమార్కులు నిబంధనలకు విరుద్ధంగా భూ దందా సాగిస్తున్నారనే కోణంలో దృష్టి సారిస్తున్నారు. నగరం చుట్టూ పుట్టగొడుగుల్లా పుట్టకొస్తున్న లే అవుట్లతో పాటు అక్రమాల నివారణ లక్ష్యంగా కసరత్తు జరుగుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో హెచ్‌ఎండీఏ పట్టణ ప్రణాళిక విభాగంలో ఓ అధికారి ఏసీబీకి దొరకడంతో ఇప్పుడు ప్రధానంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చురుగ్గా సాగుతున్న నగరాలపై దృష్టి సారించారు.  

ఎలాంటి అనుమతులు లేకుండానే లే అవుట్లు.. 
ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ప్లాట్ల ధరలకు డిమాండ్‌ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమ లే అవుట్లు వెలుగుచూస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లే అవుట్‌ ఏర్పాటు చేయాలంటే రెవెన్యూ శాఖ నుంచి ల్యాండ్‌ కన్వర్షన్‌ అనుమతులు తీసుకోవాలి. పట్టణ ప్రణాళిక విభాగం నుంచి అంగీకారం కావాలి. అయితే ఇవేమీ పట్టనట్లు కొందరు అక్రమార్కులు..అనుమతులు లేకుండానే లే అవుట్లను చేసి కొనుగోలుదారులకు అంటగడుతున్నారు. ఇటీవల ధంసలాపురం ఆర్వోబీ నిర్మాణ సమయంలో భూసేకరణకు సంబంధించి అక్రమంగా ఏర్పాటు చేసిన లే అవుట్లు బయటకు రావడం గమనార్హం.

అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో ఇలా అక్రమ లే అవుట్లు విచ్చలవిడిగా వెలుస్తున్నట్లు తెలుస్తోంది. గ్రీన్‌బెల్ట్‌ ఏరియాకు తప్పనిసరిగా స్థలాన్ని వదిలేయాల్సి ఉంటుంది. మొత్తం లే అవుట్‌లో 10 శాతం ప్రాంతాన్ని గ్రీన్‌బెల్ట్‌ కేటాయించాలి. ప్రస్తుత డిమాండ్‌ నేపథ్యంలో పట్టించుకోవట్లేదు. పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు అనుమతులు ఇస్తున్న నేపథ్యంలో వీటి జారీ వెనుక జరుగుతున్న అక్రమాలపై అవినీతి శాఖ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గతంలో నిర్మించిన లే అవుట్లలో 50 శాతం మేరకు గ్రీన్‌బెల్ట్‌ స్థలాలు మాయమైనట్లు సమాచారం. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే తీరుపై నిఘా పెట్టనున్నారు.  

భవన నిర్మాణ అనుమతులకు తూట్లు.. 
అక్రమ లే అవుట్లతోపాటు భవన నిర్మాణ అనుమతులపై అవినీతి నిరోధక శాఖ దృష్టి సారించినట్లు సమాచారం. ప్రధాన రహదారుల వెంబడి అనుమతులకు తిలోదకాలిచ్చి అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయి. సాధారణంగా పట్టణాల్లో వెయ్యి గజాలపైబడి ఉన్న స్థలాల్లోనే సెల్లార్లు నిర్మించాలి. రైల్వే ట్రాక్‌ల వెంబడి సెల్లార్ల నిర్మాణాలకు అనుమతులు లేవు. ప్రస్తుతం ఉన్న రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇష్టారాజ్యంగా సెల్లార్‌ల నిర్మాణాలు చేపడుతున్నారు. 

అయితే వీటి అనుమతులపైన అవినీతి శాఖ దృష్టి సారించినట్లు సమాచారం. ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాణాలతోపాటు, గత మూడేళ్ల నుంచి వచ్చిన అనుమతులపై సైతం పరిశీలన చేయనున్నారని గుసగుస. ఇప్పటికే హైదరాబాద్‌లోని హెచ్‌ఎండీఏపై దృష్టి సారించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు మరికొద్ది రోజుల్లో ఖమ్మంలో సైతం అక్రమ నిర్మాణాలు, లే అవుట్లపై దృష్టి సారించనున్నట్లు సమాచారం. విచారణతో బాగోతం బయటపడే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు