పొలం డబ్బుల వివాదంతోనే హత్య | Sakshi
Sakshi News home page

పొలం డబ్బుల వివాదంతోనే హత్య

Published Mon, Feb 12 2018 3:24 PM

woman killed in zahirabad due to land conflict - Sakshi

జహీరాబాద్‌ : మండలంలోని దిడిగి గ్రామంలో మ్యాతరి పుణ్యమ్మ(47) హత్యకు గురైన కేసులో ఆదివారం పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. సీఐ నాగరాజు కథనం మేరకు దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గుర్తు తెలియని స్థితిలో హత్యకు గురైన పుణ్యమ్మ మృతదేహం ఈ నెల 9న ఆమె సొంత చెరుకు తోటలో లభ్యమైంది. దీంతో కుమార్తె జయశీల ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 7న పుణ్యమ్మ కనిపించకుండా పోయింది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు అదే గ్రామానికి చెందిన ఎం.డి.రజాక్‌(35)ను నిందితుడిగా గుర్తించారు. రజాక్‌ పుణ్యమ్మ పొలాన్ని సగం వాటా కింద సాగు చేస్తున్నాడు. పొలంలో పండించిన ఆలుగడ్డ పంట విక్రయించగా వచ్చిన రూ.50వేలలో సగం వాటా రజాక్‌కు రావాల్సి ఉంది.

ఈ విషయమై ఎన్ని మార్లు అడిగినా ఆమె రజాక్‌కు డబ్బులు ఇవ్వలేదు. ఈ క్రమంలో 7న మధ్యాహ్నం పుణ్యమ్మ, రజాక్‌లు పొలం వద్ద ఉన్నారు. ఇంతలోనే చింతకాయల వ్యాపారి జిలానీ అక్కడకు వెళ్లి చింతచెట్టు లీజు డబ్బులు రూ.5వేలు పుణ్యవతికి ఇచ్చి వెళ్లాడు. అప్పుడు ఆమె ఆ డబ్బులను దగ్గర పెట్టుకోమని రజాక్‌ చేతికి ఇచ్చింది. సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని పుణ్యమ్మ రజాక్‌ను కోరింది. తనకు ఆలుగడ్డల డబ్బులు రావాల్సి ఉంది, అందుకే ఈ డబ్బులు ఇవ్వనని రజాక్‌ సమాధానం ఇచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన రజాక్‌ తన చేతిలో ఉన్న గొడ్డలితో పుణ్యమ్మపై దాడి చేసి నరికి హత్యకు పాల్పడినట్లు సీఐ వివరించారు. నిందితుడు నేరం అంగీకరించడంతో అతడి నుంచి హత్యకు ఉపయోగించిన గొడ్డలితోపాటు రూ.5 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. దిడిగి గ్రామ క్రాస్‌రోడ్డు వద్ద గల ఓ హోటల్‌లో ఉన్న నిందితుడు రజాక్‌ను పట్టణ ఎస్‌ఐ ప్రభాకర్‌రావుతో కలిసి వెళ్లి పట్టుకుని విచారించగా హత్యకు పాల్పడినట్లు అంగీకరించాడన్నారు. హత్య కేసును ఛేదించినందుకు పోలీసు సిబ్బంది వెంకటేశం, అమర్‌నాథ్‌రెడ్డి, సురేందర్, శ్రీనివాస్, జైపాల్‌రెడ్డి, సామెల్‌ల పేర్లను రివార్డు కోసం సిఫారసు చేసినట్లు తెలిపారు.

Advertisement
Advertisement