‘కౌలు’కు కష్టమే !

22 Jan, 2018 16:30 IST|Sakshi

వరినాట్లకు సిద్ధమవుతున్న కౌలు రైతు

పెట్టుబడి సాయానిక ప్రభుత్వం నిరాకరణ  

పోడు రైతులదీ అదే పరిస్థితి  

జిల్లాలో 35 వేల మందికి అన్యాయం  

పునరాలోచన చేయాలంటున్న రైతుసంఘాలు

బూర్గంపాడు:  పంటల సాగుకు ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయంపై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే సర్కారు రూపొందించిన విధివిధానాలు వారిలో ఆందోళన కలిగిస్తున్నాయి. సాయం చేసే విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు రైతులను ఆలోచనలో పడేస్తున్నాయి. పంటలు సాగు చేసేవారికి కాకుండా భూముల పట్టాదారులకే పెట్టుబడి అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కౌలురైతుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఏజెన్సీ ప్రాంతంలో ఏళ్ల తరబడి పోడుభూములు సాగుచేసుకుంటున్న గిరిజన రైతులకు కూడా పెట్టుబడి సాయం అందే పరిస్థితులు లేవు. దీంతో జిల్లాలో 35వేల మందికి పైగా రైతులకు నష్టం జరిగే అవకాశాలున్నాయి.  

కౌలురైతులకు మొండిచేయి...
పంటల సాగుకు పెట్టుబడి ఖర్చులు అందిస్తామని చెబుతున్న ప్రభుత్వం కేవలం భూములు పట్టాదారులకే సాయమందిస్తే... వాస్తవానికి ఆ భూముల్లో పంటలు సాగు చేసే కౌలురైతుల పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జిల్లాలో 28వేల మందికి పైగా కౌలురైతులున్నారు. వీరికి సాగు పెట్టుబడులకు బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వటం లేదు. కేవలం ప్రైవేటు వడ్డీలతో సాగు చేయాల్సి వస్తోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, గిట్టుబాటు ధరలు దక్కకపోవటంతో ఏటా నష్టాలే చవిచూస్తున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మళ్లీ కౌలు వ్యవసాయమే చేస్తున్నారు. వరుస పంటనష్టాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల్లో ఎక్కువమంది కౌలురైతులే కావటం గమనార్హం. ఇప్పుడు ప్రభుత్వ పెట్టుబడి సాయం కూడా ఇవ్వబోమని ప్రకటించటం వారిని మరింత కుంగదీస్తోంది. పంటలు సాగు చేసేవారికి పెట్టుబడి సాయం అందించకుండా భూములు కౌలుకు ఇచ్చి పంటలు సాగుచేయని పట్టాదారులకు పెట్టుబడి సాయం ఇస్తే లాభమేమిటని కౌలురైతులు ప్రశ్నిస్తున్నారు. తమకే సాయమందించాలని  కోరుతున్నారు.  కాగా, ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతర రైతులకు కౌలు కూడా చెల్లదని అధికారులు చెబుతున్నారు. దీంతో కౌలురైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని రైతుసంఘాల నాయకులు కోరుతున్నారు.  

అటవీ భూములకు సాయం పూజ్యం...
 ఏళ్ల తరబడి పోడుభూములు సాగుచేసుకుంటూ అటవీహక్కు పత్రాలు పొందిన గిరిజన రైతులకు కూడా పెట్టుబడి సాయం అందే పరిస్థితి లేదు. అటవీ హక్కులు కలిగిన భూములను రెవెన్యూ అధికారులు సాగు పెట్టుబడి పథకంలోకి తీసుకురాలేదు. దీంతో పోడుసాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు కూడా ప్రభుత్వం మొండిచేయి చూపించే పరిస్థితి నెలకొంది. గిరిజనేతర రైతులకు భూములున్నా పట్టాహక్కులు లేక సాయం అందటం లేదు. దీంతో జిల్లాలో సగం మందికి మాత్రమే పెట్టుబడి ఖర్చులు రానున్నాయి.

ఏజెన్సీలోనే సాగు అధికం..  
జిల్లాలో సాగు విస్తీర్ణం ఏజెన్సీ ప్రాంతంలోనే ఎక్కువగా ఉంది. గిరిజనులు, గిరిజనేతరులు ఏళ్ల తరబడి పోగు వ్యవసాయం చేస్తున్నారు. వీరిలో చిన్న, సన్నకారు రైతులే ఎక్కువ. ఐదెకరాల లోపు భూమి ఉన్నవారే మూడొంతుల మంది ఉన్నారు. గిరిజనేతర రైతులు తమకున్న ఎకరా, రెండెకరాలకు తోడు మరో నాలుగైదు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని పంటలు సాగుచేస్తున్నారు. కేవలం పంటల సాగుపైనే వీరి జీవనం ఆధారపడి ఉంది. పోడుభూములు సాగుచేసుకుంటున్న గిరిజన రైతులకు కూడా పదెకరాలలోపు భూములే ఉన్నాయి. వీరిలో చాలా మందికి అటవీహక్కు పత్రాలు కూడా ఉన్నాయి. అయితే ఆ భూములకు కూడా పంట సాయం అందదని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రైతుల్లో కలవరం మొదలైంది. 

మరిన్ని వార్తలు