నాణ్యతకు తిలోదకాలు.!

7 Feb, 2018 18:02 IST|Sakshi
మాదారం టౌన్‌షిప్‌లో నిర్మాణ దశలో ఉన్న నీటి ట్యాంకు

నాసిరకంగా ‘మిషన్‌ భగీరథ’ పనులు

కనిపించని క్యూరింగ్‌ 

నాసిరకం ఇసుక వాడకం

చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు

వెల్లువెత్తుతున్న నిరసనలు  

తాండూర్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం తాండూర్‌ మండలంలో అభాసుపాలవుతుంది. ఇష్టారీతిన, నిబంధనలు పాటించకుండా ట్యాంక్‌ల నిర్మాణం చేపడుతుండడంతో ప్రభుత్వ చేరేలా కనిపించడం లేదు. ఓవర్‌ హెడ్‌ ట్యాంకుల నిర్మాణంలో నాణ్యతలేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తుండడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  మండలంలోని ఏడు పంచాయతీల పరిధిలో ప్రభుత్వం మిషన్‌ భగీరథ పనులు  చేపట్టింది. మొత్తం 49 ఓవర్‌హెడ్‌ ట్యాంకుల నిర్మాణంతో పాటు పైప్‌లైన్‌ నిర్మాణ పనులను ప్రారంభించింది. 49 నీటి ట్యాంకులలో ఇప్పటికీ 15 ట్యాంకుల నిర్మాణాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. ఈ 15లో ఏ ఒక్కటి కూడా పూర్తి కాలేదు.
 
పనుల్లో కనిపించని నాణ్యత...
ట్యాంకుల నిర్మాణ పనులు నాణ్యత లేకుండా సాగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాసిరకం ఇసుక వాడకం, క్యూరింగ్‌ సరిగా చేపట్టడం లేదు. దీంతో నాణ్యతలేమి కొట్టొచ్చినట్లు కనబడుతుంది. నిర్మాణ పనులకు కాం ట్రాక్టర్లు ముందుకు రావడం లేదనే సాకుతో అధికారులు సైతం చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు బాహటంగా విమర్శిస్తున్నారు. పనుల్లో నాణ్య త పాటించక పోవడం, క్యూరింగ్‌ చేపట్టక పోవడంపై స్థానికులు అధికారులకు ఫిర్యాదులు చేసిన సంఘటనలు ఉన్నా యి. అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రావడం లేదు. అధికారులు నిర్లిప్త ధోరణిని అవలంబిస్తుండడంతో ప నులు అస్తవ్యస్తంగా కొనసాగుతున్నాయి.

ఎమ్మెల్యేకు ఫిర్యాదు..
మిషన్‌ భగీరథ పథకంలో జరుగుతున్న పనుల్లో నాణ్యత పాటించడం లేదని పేర్కొంటూ కొందరు నాయకులు ఎమ్మెల్యే దృష్టికి సైతం తీసుకువెళ్లారని సమాచారం. ఈ విషయంపై ఎమ్మెల్యే ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పూర్తిస్థాయిలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. మండల పరిధిలో రూ.13.81 కోట్లతో మిషన్‌ భగీరథ పనులు చేపడుతున్నారు. ఇందులో రూ.8.36 కోట్లతో ట్యాంక్‌ల నిర్మాణం, రూ. 6.95 కోట్లతో అంతర్గత పైప్‌లైన్లు, నల్లా కనెక్షన్ల పనులు చేపడుతున్నారు. ఇంత భారీగా నిధులు వెచ్చించి చేపడుతున్న పనుల్లో నాణ్యత కనిపించ డం లేదు. చివరకు నిధులు దుర్వినియోగమయ్యే అవకాశముందని ప్రజలు చర్చించుకుంటున్నారు. అధికారులు పర్యవేక్షణ జరిపి నాణ్యత ప్రమాణాలు పాటించేలా చూడాలని కోరుతున్నారు.   

నిరంతరం పర్యవేక్షిస్తున్నాం 
మిషన్‌ భగీరథ ట్యాంక్‌ల నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు తీసుకోవడంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాం. పనుల నాణ్యతపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాం. క్యూరింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాం. నాసిరకంగా పనులు చేపతితే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటాం. 
– దివ్య, ఏఈ, ఆర్‌డబ్ల్యూఎస్, తాండూర్‌

మరిన్ని వార్తలు