‘మామిడిలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి’ | Sakshi
Sakshi News home page

‘మామిడిలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి’

Published Sun, Nov 19 2023 1:30 AM

- - Sakshi

చెన్నూర్‌రూరల్‌: మామిడిలో పూతకు ముందు, పూత సమయం, కాయదశలో సస్యరక్షణ చర్యలు చేపట్టకుంటే దిగుబడి తగ్గుతుందని వ్యవసాయాధికారి తిరుపతి తెలిపారు. మామిడిలో సస్యరక్షణ చర్యలపై ఓ ప్రకటనలో ఆయన పలు సూచనలు చేశారు. జిల్లాలోని బెల్లంపల్లి, జైపూర్‌, నెన్నెల, భీమిని, కోటపల్లి, వేమనపల్లి, చెన్నూర్‌ మండలాల్లో రైతులు మామిడి సాగు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకు రైతులు మామిడిలో పాటించిన సమగ్ర సాగు పద్ధతులను అనుసరించి నవంబర్‌లో ముదిరిన రెమ్మల్లో పూమొగ్గ ఏర్పడుతుందని తెలిపారు. వాతావరణ పరిస్థితులతో డిసెంబర్‌ రెండో వారం నుంచి జనవరి మొదటి వారం వరకు పూమొగ్గలు వస్తాయని పేర్కొన్నారు. ఒక్కోసారి చలి ఎక్కువగా ఉన్నప్పుడు పూమొగ్గలు ఆలస్యంగా కనబడతాయని తెలిపారు. నీటి వసతి ఉన్న తోటల్లో మామిడి చెట్ల పాదుల్లో నీటి తడి అందించాలని సూచించారు. లీటరు నీటికి వెట్టబుల్‌ సల్ఫర్‌ ఐదుగ్రాములు కలిపి పిచికారీ చేస్తే పూమొగ్గలన్నీ ఒకేసారి చిగురిస్తాయని తెలిపారు. లీటరు నీటిలో పొటాషియం నైట్రేట్‌ (మల్టికే) 10గ్రాములతో పాటు యూరియా 10 గ్రాములు కలిపి పిచికారీ చేసినా ఫలితం ఉంటుందని పేర్కొన్నారు. ఈ పద్ధతులు ముందస్తుగా పాటిస్తే పూత బాగా రావడమే కాకుండా, కాయలు కూడా రాలిపోకుండా ఉంటాయని తెలిపారు.

Advertisement
Advertisement