మహిళా సంఘాల కరుణ ఎవరిపైనో! | Sakshi
Sakshi News home page

మహిళా సంఘాల కరుణ ఎవరిపైనో!

Published Sun, Nov 19 2023 1:30 AM

- - Sakshi

జయాపజయాలపై ప్రభావం చూపనున్న ఎస్‌హెచ్‌జీలు

బెల్లంపల్లి నియోజకవర్గంలో 42,518 మంది సభ్యులు

నెన్నెల: అసెంబ్లీ ఎన్నికల్లో స్వయం సహాయక సంఘాల సభ్యులు ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. బెల్లంపల్లి నియోజకవర్గంలో 1,73,335 మంది ఓటర్లున్నారు. ఇందులో మహిళలు 86,749 మంది ఉండగా.. ఇందులో మహిళా సంఘాల సభ్యులు 42,518 మంది ఉన్నారు. బెల్లంపల్లి మండలంలో మహిళా సంఘాల సభ్యులు 6,851, నెన్నెలలో 6,561, భీమినిలో 3,231, కన్నెపల్లిలో 4,644, కాసిపేటలో 8,164, తాండూర్‌లో 8,500, వేమనపల్లిలో 4,561 మహిళా సంఘాల సభ్యులున్నారు. వారి ఓట్లకు గాలం వేసేందుకు అన్ని పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గ్రామాలవారీగా ఆయా రాజకీయ పార్టీల నాయకులు దృష్టి సారించారు. అభ్యర్థులు నేరుగా కాకుండా ఆయా ప్రాంతాల్లోని క్షేత్రస్థాయి నేతలతో మాట్లాడిస్తున్నారు. వారికి ఉన్న ఇబ్బందులను తెలుసుకుంటున్నారు. మహిళా సంఘాలకు పార్టీల ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న అంశాలపై కాకుండా స్థానికంగా ఏమి అవసరమో గుర్తించి నివారించే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామస్థాయిలో మహిళా సంఘాల భవనాలు, వాటిలో సౌకర్యాలతో పాటు తమకు అనుకూలంగా మారేందుకు ఏమి కావాలో అడుగుతున్నారు. ఈ విషయంలో గ్రామ, మండల స్థాయి సంఘాల నాయకులతో మంతనాలు జరుపుతున్నారు. అభ్యర్థులు మహిళా సంఘాల సభ్యులతో సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. మహిళా సంఘాలను మచ్చిక చేసుకుని తమ వైపు ఓట్లు వేసుకునేలా ఎవరికి వారే ప్రయత్నిస్తున్నారు. మహిళా సంఘాల సభ్యులకు ఏమి కావాలనే విషయంలో ఆచీతూచి వ్యవహరిస్తున్నారు. వీవోలు, మండల సమాఖ్యలను సంప్రదించి ఓట్లు తమకు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. డబ్బులతో ప్రలోభపెట్టే చర్యలకు పూనుకున్నట్లు సమాచారం. దీని ద్వారా గంపగుత్తగా సంఘాల ఓట్లన్నీ తమ ఖాతాల్లో పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై అభ్యర్థులు రహస్యంగా మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది. అభ్యర్థుల భవిష్యత్‌ను తేల్చే శక్తి మహిళా సంఘాలకు ఉందని చెప్పకనే చెబుతున్నారు. వీటిపై ప్రత్యేక శ్రద్ధ చూపి ఈ ఓట్లకు ఎలాగైనా గాలం వేయాలని అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు. మెజార్టీ ఓట్లు ఎవరికి పోలైతే వారి గెలుపు ఖాయమని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement