ఎల్‌ఈడీ వెలుగులేవీ?

27 Jan, 2018 12:44 IST|Sakshi

నంద్యాల, గోస్పాడు మండలాల్లో మాత్రమే పూర్తి

మిగిలిన పంచాయతీల్లో ఊసే లేని వైనం

కర్నూలు(అర్బన్‌): గ్రామాల్లో ఎల్‌ఈడీ దీపాల ఏర్పాటుకు గ్రహణం పట్టింది. గతేడాది ప్రారంభంలో జిల్లాలోని 889  పంచాయతీల్లో ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో నంద్యాల, గోస్పాడు మండలాల్లో మాత్రమే పూర్తి ఎల్‌ఈడీ దీపాలు ఏర్పాటు చేశారు. మిగిలిన పంచాయతీ(854)ల గురించి పట్టించుకోవడం లేదు. కర్నూలు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో  ఈఎస్‌ఐఎల్‌ కంపెనీ ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేసేందుకు కాంట్రాక్టు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. 

మూడో లైన్‌ ఏదీ?
గ్రామ పంచాయతీల్లోని అన్ని వీధుల్లో ఎల్‌ఈడీ లైట్లు వేయాలంటే ముందుగా ప్రస్తుతం ఉన్న విద్యుత్‌ వైరింగ్‌కు తోడు విద్యుత్‌ సరఫరాను కంట్రోల్‌ చేసేందుకు అవసరమైన మూడో లైన్‌ను (ఆన్‌ ఆఫ్‌) వేయాల్సి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం 2,96,478 మీటర్ల వైర్‌ అవసరం కానుంది. ఏపీఎస్‌పీడీసీఎల్‌ ఉచితంగా అన్ని గ్రామ పంచాయతీల్లో మూడో లైన్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే సంస్థ ఈ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో ఎల్‌ఈడీ లైటింగ్‌లో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో 1.81,760 విద్యుత్‌ స్తంభాలు ఉన్నాయి. అనేక గ్రామ పంచాయతీలు విస్తరించిన నేపథ్యంలో తాజాగా 19,969 విద్యుత్‌ స్తంభాలను ఏర్పాటు చేయాల్సి ఉందని అధికారులు గుర్తించారు. 

ఒక్కో ఎల్‌ఈడీ బల్బుకు రూ.150 చెల్లించాల్సిందే ...
గ్రామాల్లో ఎల్‌ఈడీ బల్బుల ఏర్పాటుకు సంబంధించి ఆయా గ్రామ పంచాయతీలు ఒక్కో బల్బుకు రూ.150 ప్రకారం  చెల్లించాల్సి ఉంది. ఒక్క సారి ఈ మొత్తం చెల్లిస్తే సదరు కంపెనీ పదేళ్లపాటు వాటి నిర్వహణ బాధ్యతను స్వీకరిస్తుంది. ఈ మేరకు జిల్లాలో మొత్తం 2,01,729 ఎల్‌ఈడీ బల్బులకు గాను రూ.3.02 కోట్లను పంచాయతీలు చెల్లించాల్సి ఉంది.

మార్చి నాటికి పూర్తి చేయాలని కోరాం  
జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో మూడో విద్యుత్‌ లైను ఏర్పాటు చేయాలని ఏపీఎస్‌పీడీసీఎల్‌ అధికారులను కోరాం. అలాగే అవసరమైన మేరకు కొత్తగా విద్యుత్‌ స్తంభాలను ఏర్పాటు చేయించేందుకు చర్యలు చేపట్టాం. ఈ పనులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని పంచాయతీల సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. మార్చి ఆఖరు నాటికి ఎల్‌ఈడీ లైటింగ్‌ సిస్టమ్‌ దాదాపు పూర్తి చేయాలని కోరాం.
– బీ పార్వతి, జిల్లా పంచాయతీ అధికారిణి 

Read latest Kurnool News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు