డంపింగ్‌ యార్డుల జాడేదీ ?

8 Feb, 2018 16:32 IST|Sakshi
అప్పంపల్లిలో ఖాళీ స్థలంలో చెత్తవేసి నిప్పంటించిన తీరు

18 గ్రామాలకుగాను నాలుగు చోట్లే ఏర్పాటు

స్థలాలు లేక ప్రారంభంకాని పనులు 

మరికొన్ని గ్రామాల్లో నత్తనడకన సాగుతున్న వైనం 

రోడ్లపైనే చెత్తాచెదారం పారబోతతో ఇక్కట్లు 

‘‘పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని.. తడి, పొడి చెత్తను వేర్వేరు చేసి ఇళ్ల వద్దకు వచ్చే రిక్షాల్లోనే వేయాలి అని.. పేర్కొంటూ గ్రామాల్లో ఆర్భాటంగా డంపింగ్‌యార్డుల నిర్మాణాలు ప్రారంభించారు. అంతవరకూ బాగానే ఉన్నా నెలలు గడుస్తున్నా నేటికీ మండలంలో నాలుగు గ్రామాల్లోనే అవి పూర్తికాగా.. కొన్ని గ్రామాల్లో స్థలాలు లేక, మరికొన్ని గ్రామాల్లో నత్తనడకన డంపింగ్‌యార్డుల నిర్మాణాలు సాగుతున్నాయి. దీంతో పారిశుద్ధ్యం పడకేసింది,

చిన్నచింతకుంట : మండలంలోని ఆయా గ్రామాల్లో డంపింగ్‌యార్డుల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేపడుతూ ఆరోగ్యకరమైన వాతావరణం గల గ్రామాలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం డంపింగ్‌యార్డుల నిర్మాణాలు నెలల కిందట చేపట్టింది. మండలంలోని 18 గ్రామాల్లో డంపింగ్‌యార్డు నిర్మాణ పనులు ప్రారంభించగా.. 4 గ్రామాలైన ఉంద్యాల, దాసర్‌పల్లి, ముచ్చింతల, అల్లీపూర్‌లో మాత్రం పూర్తయ్యాయి. డంపింగ్‌యార్డుల నిర్మాణాల కోసం ఈజీఎస్‌ అధికారులు స్థలాలు ఎంపిక చేశారు. అయితే, ఉపాధి కూలీలతో 8 గ్రామాలైన గూడూర్, నెల్లికొండి, వడ్డెమాన్, మద్దూర్, లాల్‌కోట, తిర్మలాపూర్‌ , అమ్మాపూర్, చిన్నచింతకుంటలో డంపింగ్‌యార్డు గుంతలను ఇప్పుడిప్పుడే తవ్వుతున్నారు. మిగిలిన 6 గ్రామాల్లో స్థలం లేక డంపింగ్‌ యార్డు పనులకు నోచుకోలేదు.

పేరుకుపోతున్న చెత్తా చెదారం 
పట్టణంతో పాటు ఆయా గ్రామపంచాయతీలలో తడి, పొడి చెత్తలను ఎక్కడపడితే అక్కడ పారవేయడంతో పరిసర ప్రాంతాలన్ని దుర్భరంగా తయారవుతున్నాయి. గ్రామంలో పారిశుద్ధ్య వారోత్సవాల కార్యక్రమాల్లో తప్ప మిగిలిన రోజుల్లో అధికారులు పరిశుభ్రతపై శ్రద్ధ తీసుకోకపోవడంతో చెత్తకుప్పలు ఎక్కడపడితే అక్కడ దర్శనమిస్తున్నాయి. వీటితో పాటు తడిపొడి చెత్తలను తీసుకెళ్లడానికి ప్రభుత్వం ఇచ్చిన రిక్షాలు కూడా నిరుపయోగంగా మారాయి. అవి పంచాయతీ ఆవరణలకే పరిమితమయ్యాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆయా గ్రామాల్లో చెత్తనిల్వల కోసం డంపింగ్‌యార్డులను వెంటనే చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

అపరిశుభ్రంగా మారాయి 
గ్రామాల్లో డంపింగ్‌యార్డు పనులు నిలిచిపోవడంతో చెత్తా చెదారం రోడ్లపైనే పారబోస్తున్నారు. దీంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. పందుల సంచారం పెరిగింది. దీనితో పాటు ఈగలు, దోమలు వ్యాప్తిచెంది రోగాలబారిన పడే అవకాశం ఉంది. అధికారులు స్పందించి డంపింగ్‌యార్డులు త్వరగా పూర్తిచేయాలి. 
– చంద్రశేఖర్‌గౌడ్, అప్పంపల్లి 

త్వరలో పూర్తి చేస్తాం 
మండలంలోని అన్ని గ్రామాల్లో డంపింగ్‌యార్డుల నిర్మాణ పనులను వేగవంతంగా చేస్తాం. పర్దిపూర్, బండ్రవల్లి, పల్లమర్రి, కురుమూర్తి దమగ్నాపూర్,అప్పంపల్లి గ్రామాల్లో రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలాన్ని ఊరికి దూరంగా చూపించకపోవడంతో పనులు మొదలుపెట్టలేక పోయాం. త్వరలో స్థలాలు ఎంపిక చేసి పూర్తిచేస్తాం. 
– నవీన్‌కుమార్, ఏపీఓ

మరిన్ని వార్తలు