పదేళ్ల తర్వాత తల్లి చెంతకు..

24 Feb, 2018 17:35 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అప్పట్లో కాచిగూడ రైల్వేస్టేషన్‌లో తప్పిపోయిన బాలిక

హోం నిర్వాహకుల సమాచారంతో ఆరా తీసిన జిల్లా అధికారులు

ఫొటో చూసి గుర్తించిన తల్లి

గద్వాల అర్బన్‌ : పదేళ్ల క్రితం పొట్ట చేత పట్టుకుని వలస వెళ్లిన ఆ కుటుంబానికి అప్పట్లో విషాదం ఎదురైంది. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న భర్త చనిపోయిన కొన్నాళ్లకే కూతురు కూడా కనిపించకుండా పోయింది. అలా పదేళ్లుగా ఆ తల్లి కూతురి కోసం దుఖిస్తుండగా ఇప్పుడు బిడ్డ ఆచూకీ తెలిసిన వైనమిది.  గద్వాలలోని వడ్డెగేరికి చెందిన పద్మ, రాముడు భార్యాభర్తలు. భర్త మరణం తర్వాత పొత్తిళ్లలో ఉన్న కుమారుడు, ఆరేళ్ల కుమార్తెతో కలిసి పొట్ట చేతపట్టుకొని హైదరాబాద్‌ వెళ్లింది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ ప్రాంతంలో అడ్డా కూలీగా మారింది. ఇదే క్రమంలో పద్మ తల్లి చనిపోయిందని సమాచారం రాగానే కాచిగూడ రైల్వేస్టేషన్‌కు ఆమె వచ్చింది. అక్కడ రద్దీ ఉండడంతో ఆరు నెలల కుమారుడిని కుమార్తె హైమావతి చేతిలో పెట్టి టికెట్‌ తెచ్చేందుకు వెళ్లి వచ్చే సరికి కుమారుడు మాత్రమే ఉన్నాడు.

దీంతో అప్పటి నుంచి కుమార్తె కోసం వెతుకుతున్నా ఫలితం కనిపించలేదు. కాగా, అప్పట్లో హైమావతిని చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ సిబ్బంది సికింద్రాబాద్‌లోని నవజీవన హోంకు, ఆతర్వాత నింబోలి అడ్డాలోని ప్రత్యేక చిల్డ్రన్‌ హోం(బాలికల), రాజేంద్రనగర్‌లోని కేజీబీవీ పాఠశాలకు తరలించారు. 6, 8వ తరగతి వరకు చదవిన హైమావతి తన తల్లి గద్వాలలో ఉన్నారని నిర్వాహకులకు చెప్పగా వారు జిల్లా బాలల సంరక్షణ అధికారి రాములుకు మహబూబ్‌నగర్‌ అధికారులు ఫొటోతో పాటు సమాచారం ఇచ్చారు. ఆయన ఇచ్చిన సమాచారంతో వడ్డేగేరి అంగన్‌వాడీ కార్యకర్త ఫొటోలో ఉన్న బాలికను గుర్తు పట్టి ఆమె తల్లి పద్మకు చూయించింది. తన కుమార్తెను ఆమె గుర్తించగా.. మహబూబ్‌నగర్‌ స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బాలిక హైమావతిని తల్లి పద్మకు గురువారం అప్పగించారు. 

మరిన్ని వార్తలు