దర్శకులు మూడు రకాలు!

6 Aug, 2017 00:23 IST|Sakshi
దర్శకులు మూడు రకాలు! – త్రివిక్రమ్‌

  – త్రివిక్రమ్‌
‘‘దర్శకుడు సుకుమార్‌ మాట్లాడుతూ డైరెక్టర్లు రెండు రకాలు. ఎడిటింగ్‌ రూమ్‌ డైరెక్టర్లు. సెట్‌ డైరెక్టర్లు అన్నారు. ఆయనకు తెలియని మూడో రకం డైరెక్టర్లు కూడా ఉన్నారు. సినిమా అంతా అయిపోయి రిలీజ్‌  తర్వాత ఇది ఇలాకన్నా ఇంకోలా చేస్తే బాగుండు అనుకుంటాను. అది నేను. సో .. మూడో రకం డైరెక్టర్లు కూడా ఉన్నారు’’ అన్నారు డైరెక్టర్‌ త్రివిక్రమ్‌.

నితిన్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘లై’. వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. మణిశర్మ స్వరకర్త. ఈ సినిమా ప్రీ–రిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. థియేట్రికల్‌ ట్రైలర్‌ను సుకుమార్, ఆడియోను త్రివిక్రమ్‌ లాంచ్‌ చేశారు. త్రివిక్రమ్‌ మాట్లాడుతూ– ‘‘నేను మణిశర్మ ఫ్యాన్‌ని. ఆయన గురించి చెప్పే స్థాయి మనకు లేదు. ట్రైలర్‌ చూసిన తర్వాత ఈ సినిమా హిట్‌ అవుతుందనుకున్నాను.

రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర, వెంకట్‌లా సినిమాను ప్రేమించి తీసే నిర్మాతలు చాలా తక్కువ మంది ఉంటారు’’ అన్నారు. డైరెక్టర్‌ సుకుమార్‌ మాట్లాడుతూ– ‘‘డైరెక్టర్లు రెండు రకాలు. ఎడిటింగ్‌ రూమ్‌ డైరెక్టర్, సెట్‌ డైరెక్టర్‌. నేను ఎడిటింగ్‌ రూమ్‌ డైరెక్టర్‌ను. హను సెట్‌లో సీన్‌ను ఊహించగలడు. రామ్‌గారి ప్రేమ, గోపీగారి నిశ్శబ్దం, అనిల్‌గారి దూకుడు కలిస్తే 14 రీల్స్‌. ఇప్పుడు వీరికి తోడుగా వెంకట్‌ వచ్చారు. వారి కోసం సినిమా పెద్ద హిట్‌ కావాలి. నితిన్‌ లుక్‌ బాగుంది’’ అన్నారు.

‘‘ఈ సినిమా అవుట్‌పుట్‌ బాగా రావడం వెనక చిత్రబృందం కృషి ఎంతో ఉంది. ఈ సినిమాను నితిన్‌ నాకన్నా ఎక్కువగా నమ్మాడు’’ అన్నారు హను రాఘవపూడి. నితిన్‌ మాట్లాడుతూ– ‘‘కల్యాణ్‌ (పవన్‌ కల్యాణ్‌) గారు ఈ ఫంక్షన్‌కి రాలేదు. ఆయన సోల్‌మెట్‌ త్రివిక్రమ్‌ వచ్చారు కాబట్టి, ఆయన వచ్చినట్టే. నా కెరీర్‌లో ఇది 24వ  సినిమా. నెక్ట్స్‌ 25వ సినిమా కల్యాణ్‌గారి ఫస్ట్‌ ప్రొడక్షన్‌లో నేను చేయబోతున్న ఫస్ట్‌ సినిమా. అంతకంటే ఒక ఫ్యాన్‌గా నాకేం కావాలి.

అనిల్‌గారు నా స్వీట్‌ హార్ట్‌. గోపీగారు, రామ్‌గారు, వెంకట్‌గారు చాలా ప్యాషనెట్‌ అండ్‌ డేరింగ్‌ ప్రొడ్యూసర్స్‌. హనూకి సినిమా అంటే పిచ్చి, ప్యాషన్‌. మణిశర్మ మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. రీ–రికార్డింగ్‌ ఇంటర్నేషనల్‌ లెవల్‌లో ఉంటుంది’’ అన్నారు. నిర్మాత అనిల్‌ సుంకర మాట్లాడుతూ– ‘‘మూవీ స్టార్ట్‌ చేసిన రోజునే ఆగస్టు 11న రిలీజ్‌  అనుకున్నాం. ఇప్పుడు అదే రోజున రిలీజ్‌ చేస్తున్నాం’’ అన్నారు. ఈ వేడుకలో చిత్రబృందంతో పాటు పలువురు అతిథులు పాల్గొన్నారు.

>