‘నేను, మా నాన్న ఆయన సినిమాలకు ఫ్యాన్స్‌’

19 Jan, 2020 20:41 IST|Sakshi

శ్రీలంక వెళ్లాలని భావిస్తున్న సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌కు ఆ దేశం వీసా నిరాకరించిందనే వార్తలు కొద్ది రోజులుగా ప్రచారంలో ఉన్నాయి. కొన్ని అనివార్య కారణాల వల్ల శ్రీలంక ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుందని వాటి సారాంశం. అయితే ఆ వార్తలను శ్రీలంక ప్రధాని మహిందా రాజపక్స తనయుడు నమల్‌ రాజపక్స కొట్టిపారేశారు. రజనీకాంత్‌కు శ్రీలంక ప్రభుత్వం వీసా నిరాకరించిందనడంలో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. రజినీ సినిమాలకు తను పెద్ద అభిమానినని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ఓ పోస్ట్‌ చేశారు. 

‘ప్రముఖ నటుడు రజినీకాంత్‌కు శ్రీలకం ప్రభుత్వం వీసా నిరాకరించదనేది కేవలం రూమర్‌ మాత్రమే. శ్రీలంకలోని ప్రజల మాదిరిగానే నేను, మా నాన్న రజినీకాంత్‌ సినిమాలకు చాలా పెద్ద అభిమానులం. ఒకవేళ ఆయన మా దేశాన్ని సందర్శించుకోవాలంటే ఎలాంటి అవాంతరాలు ఉండబోవని’ చెప్పారు. అయితే కొద్ది రోజుల క్రితం శ్రీలంక నార్తర్న్‌ ప్రొవిన్స్‌ మాజీ ముఖ్యమంత్రి సీవీ విఘ్నేశ్వరన్ రజనీకాంత్‌ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శ్రీలంకలోని తమిళుల సమస్యలను ఆయన రజినీకాంత్‌తో చర్చించారు. ఈ భేటీ అనంతరం రజనీకాంత్‌ తమ దేశం రావాల్సిందిగా ఆహ్వానించారు. కాగా, ఇటీవల విడుదలైన రజనీకాంత్‌ దర్బార్‌ చిత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌లో ‘తలైవార్‌ 168’ చిత్రంలో నటిస్తున్నారు. 

>
మరిన్ని వార్తలు