'సాహసం శ్వాసగా సాగిపో' మూవీ రివ్యూ

11 Nov, 2016 12:49 IST|Sakshi
'సాహసం శ్వాసగా సాగిపో' మూవీ రివ్యూ

టైటిల్ : సాహసం శ్వాసగా సాగిపో
జానర్ : రొమాంటిక్ థ్రిల్లర్
తారాగణం : నాగచైతన్య, మంజిమా మోహన్, బాబాసెహగల్, సతీష్ కృష్ణన్
సంగీతం : ఏ ఆర్ రెహమాన్
దర్శకత్వం : గౌతమ్ మీనన్
నిర్మాత : మిర్యాల రవీందర్ రెడ్డి

ప్రేమమ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన నాగచైతన్య హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సాహసం శ్వాసగా సాగిపో. ఈ ప్రేమమ్ కన్నా ముందే రిలీజ్ కావాల్సి ఉన్నా తమిళ వర్షన్ షూటింగ్ ఆలస్యం కావటంతో వాయిదా పడుతూ వచ్చింది. అయితే గతంలో గౌతమ్ మీనన్, నాగచైతన్య కాంబినేషన్లో వచ్చిన ఏంమాయ చేసావే ఘనవిజయం సాధించటంతో సాహసం శ్వాసగా సాగిపో సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా..


కథ :
రజనీకాంత్ మురళీధర్ (నాగచైతన్య).. ఇంజనీరింగ్ పూర్తి చేసి సరైన ఉద్యోగం రాకపోవటంతో ఎంబిఏ చేస్తూ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తుంటాడు. అదే సమయంలో తన చెల్లెలి కాలేజ్ ఫంక్షన్లో లీలా సత్యమూర్తి(మంజిమా మోహన్) అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. తరువాత అదే అమ్మాయి కోర్సు చేయటం కోసం తన చెల్లితో కలిసి తన ఇంట్లోనే ఉండటంతో మరింత ఆనందపడిపోతాడు. కొద్ది రోజుల్లోనే లీలాతో రజనీకాంత్కు మంచి పరిచయం ఏర్పడుతుంది. అదే సమయంలో తాను కన్యాకుమారిలో సూర్యోదయం చూడటానికి బైక్ మీద వెళుతున్న విషయం లీలాతో చెప్తాడు రజనీకాంత్.

లీలా కూడా రజనీకాంత్తో కలిసి కన్యాకుమారి బయలుదేరుతుంది. ఈ జర్నీలో ఇద్దరూ మరింత దగ్గరవుతారు. కన్యాకుమారి నుంచి తిరిగి వచ్చే సమయంలో అనుకోకుండా వాళ్ల బైక్కు యాక్సిడెంట్ అవుతుంది. ఇక తను బతకనేమో అన్న భయంతో లీలాతో తాను ప్రేమిస్తున్న విషయం చెప్పేస్తాడు రజనీకాంత్. తరువాత కళ్లు తెరిచే చూసేసరికి ఆస్పిటల్లో ఉంటాడు లీల తనతో ఉండదు. మూడు రోజుల తరువాత హస్పిటల్కు ఫోన్ చేసిన లీలా, తమ కుటుంబం ప్రమాదంలో ఉందని, బైక్ యాక్సిడెంట్ కూడా తనను చంపాడానికి కావాలని చేయించిందే అని చెపుతుంది. దీంతో తన ప్రేమించిన అమ్మాయికి తోడుగా నిలబడాలన్న ఆలోచనతో లీలా కోసం బయలుదేరుతాడు రజనీకాంత్.

అప్పటికే లీలా తల్లిదండ్రుల మీద హత్యా ప్రయత్నం జరగటంలో వాళ్లు హాస్పిటల్లో ఉంటారు. నాగచైతన్య అక్కడ చేరుకున్న తరువాత మరోసారి లీలా, ఆమె కుటుంబం మీద ఎటాక్ జరుగుతుంది. మొదటి అప్పుడు చైతూ కాపాడిన తరువాత జరిగిన ఎటాక్లో లీలా కుటుంబంతో పాటు రజనీకాంత్ ఫ్రెండ్ మహేష్ కూడా చనిపోతాడు. దీంతో ఇదంతా అసలు ఎందుకు జరుగుతుంది..? వాళ్లు లీలాను ఎందుకు చంపాలనుకుంటున్నారు..? దీనికి పోలీసులు కూడా ఎందుకు సహకరిస్తున్నారు..? లాంటి విషయాలన్ని తెలుసుకోవాలనుకుంటాడు రజనీకాంత్. అందుకోసం ఏం చేశాడు అన్నదే మిగతా కథ.

నటీనటులు :
ప్రేమమ్ సక్సెస్తో మంచి ఫాంలో ఉన్న నాగచైతన్య, మరోసారి యాక్షన్ హీరోగా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అయితే అదే సమయంలో తనకు స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన లవర్ బాయ్ లుక్ లోనూ అలరించాడు. తనకు బాగా అలవాటైన రొమాంటిక్ క్యారెక్టర్లో మరోసారి సూపర్బ్ అనిపించిన చైతూ, ఈ సారి యాక్షన్ హీరోగా కూడా ఆకట్టుకున్నాడు. హీరోయిన్ పాత్రలో మంజిమా మోహన్ మెప్పించింది. డీసెంట్ లుక్లో కనిపిస్తూనే సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషనల్ సీన్స్లో కూడా ఆకట్టుకుంది. నాగచైతన్య ఫ్రెండ్ మహేష్గా నటించిన సతీష్ కృష్ణన్, మంచి నటనతో పాటు డ్యాన్సర్ గానూ ప్రూవ్ చేసుకున్నాడు. విలన్గా బాబా సెహగల్ తన పరిధి మేరకు ఆకట్టుకున్నాడు.

సాంకేతిక నిపుణులు :
గతంలో రొమాంటిక్ ఎంటర్టైనర్లు, యాక్షన్ థ్రిల్లర్లు తెరకెక్కించిన దర్శకుడు గౌతమ్ మీనన్ ఈ సారి రెండు ఒకే సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు. ముందు నుంచి చెపుతున్నట్టుగా ఫస్ట్ హాఫ్ అంతా హర్ట్ టచింగ్ లవ్ స్టోరీతో నడిపించిన గౌతమ్, సెకండ్ హాఫ్ను తన మార్క్ థ్రిల్లర్గా మలిచాడు. అయితే స్లో నేరేషన్, వెంట వెంటనే వచ్చే పాటలు ఫస్ట్ హాప్లో కాస్త బోర్ కొట్టిస్తాయి.

యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారిని సెంకడ్ హాఫ్ కట్టిపడేస్తుంది. బలమైన ప్రతినాయక పాత్ర లేకపోయినా మంచి యాక్షన్ సీన్స్తో ఆ లోటును కవర్ చేశాడు దర్శకుడు. మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. సినిమా రిలీజ్కు ముందు చకోరి, వెళ్లిపోమాకే పాటలు సూపర్ హిట్ అయ్యాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో సినిమా స్థాయిని పెంచాడు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమాలు స్థాయికి తగట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :
నాగచైతన్య
ప్రీ క్లైమాక్స్
సంగీతం

మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్ స్లో నేరేషన్
స్ట్రాంగ్ విలన్ లేకపోవటం

ఓవరాల్గా సాహసం శ్వాసగా సాగిపో.. టిపికల్ గౌతమ్ మీనన్ సినిమాలు ఇష్టపడేవారికి మాత్రం బాగానే కనెక్ట్ అవుతుంది.

- సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా