ఎవరికో భయపడి టైటిల్‌ మార్చొద్దు

23 May, 2018 08:21 IST|Sakshi

తమిళసినిమా: ఎవరికో భయపడి చిత్ర పేర్లను మార్చకండి అంటూ నటుడు, నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌ అన్నారు. జయ శుభశ్రీ ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎస్‌కే.సుబ్బయ్య నిర్మించిన చిత్రం నుంగంబాక్కమ్‌. ఇది సమీపకాలంలో స్వాతి అనే యువతి హత్య ఇతి వృత్తంతో తెరకెక్కుతున్న చిత్రం అన్నది గమనార్హం. దీనికి కథనం, దర్శకత్వం బాధ్యతలను ఎస్‌డీ.రమేశ్‌ సెల్వన్‌ నిర్వహించారు. ఇందులో శంకర్‌ సీఐగా అజ్మల్‌ నటించారు.ఆయిరా, మనో ముఖ్య పాత్రల్లో నటించగా ఇతర పాత్రల్లో ఏ.వెంకటేశ్‌ న్యాయవాదిగా బెంజ్‌క్లబ్‌ శక్తి సెంగోట్టై మరో ఇన్‌స్పెక్టర్‌గా నటించారు. జోన్స్‌ ఆనంద్‌ ఛాయాగ్రహణం, శ్యామ్‌ డీ.రాజ్‌ సంగీతాన్ని అందించారు. చిత్ర ట్రైలల్‌ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న విశాల్‌ ట్రైలర్‌ను ఆవిష్కరించి మాట్లాడుతూ ముందు స్వాతి కొలై వళక్కు పేరుతో జరిపిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో తాను పాల్గొన్నానన్నారు.

ఒక యథార్థ  సంఘటన ఆధారంగా రూపొందిస్తున్న చిత్రానికి అందుకు తగ్గ టైటిల్‌ పెట్టడమే న్యాయం అని పేర్కొన్నారు. అలాంటిది ఎందుకు ఈ చిత్రానికి నుంగంబాక్కమ్‌ అని పేరు మార్చారు  ఎవరైనా చెప్పారా? లేక మరెవరి ఒత్తిడి కారణంగానో టైటిల్‌ మార్చారా అని ప్రశ్నించారు. నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రాలకు టైటిల్‌ను ఎవరికో భయపడి మార్చాల్సిన అవసరం లేదని విశాల్‌ పేర్కొన్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఒక ఆసక్తి ఉంటుందని, తనకు అలాంటి ఆసక్తి ఉందని అన్నారు. తాను ఇరుంబుతిరై చిత్రంలో రెండు సన్నివేశాలను తొలగించిన సంఘటనను ఎదుర్కొన్నానని, డిజిటల్‌ ఇండియా, ఆధార్‌ కార్డు వంటి సన్నివేశాల విషయంలో సమస్యలను ఎదుర్కొన్నానని చెప్పారు. నుంగంబాక్కమ్‌ చిత్రానికి తన వంతు సహాయంగా మంచి విడుదల తేదీని కేటాయిస్తానని విశాల్‌ పేర్కొన్నారు. దర్శకుల సంఘం అధ్యక్షుడు విక్రమన్, ఎస్‌ఏ.చంద్రశేఖర్, గీతరచయిత స్నేహన్, చిత్ర యూనిట్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు