తమిళనాడులోకి లష్కరే ఉగ్రవాదులు

23 Aug, 2019 11:27 IST|Sakshi

చెన్నై: ఆర్టికల్‌ 370, జమ్మూకశ్మీర్‌ పునర్వ్యస్థీకరణ నేపథ్యంలో దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లష్కరే తోయిబాకు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు శ్రీలంక మీదుగా తమిళనాడులో ప్రవేశించినట్లు ఇంటిలిజెన్స్‌ వర్గాలు వెల్లడించాయి. ఆరుగురిలో ఒకరు పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి కాగా మిగతా ఐదుగురు శ్రీలంకకు చెందిన ముస్లింలని పేర్కొన్నాయి. హిందువులుగా దేశంలోకి చొరబడి ఉగ్ర చర్యలకు కుట్ర పన్నుతున్నారని నిఘా వర్గాలు సమాచారమిచ్చాయి.

ఇంటిలిజెన్స్‌ హెచ్చరికల నేపథ్యంలో తమిళనాడు పోలీస్‌ శాఖ కొయంబత్తూర్‌లో హై అలర్ట్‌ ప్రకటించింది. నగరంలోని అన్ని వాహనాలను విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. అటు చెన్నైలో బలగాలను పెంచారు. ఈ రెండు నగరాల్లో హోటళ్లు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్‌లు, థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌, ప్రార్థన స్థలాల్లో నిఘాను పెంచారు. తీర ప్రాంతాల్లో​ కూడా భద్రత కట్టుదిట్టం చేశారు. అనుమానితులుగా కనిపించిన వారిని అదుపులోకి తీసుకుంటున్నారు.
 
కశ్మీర్‌లో అల్లకల్లోలం సృష్టించేందుకు అఫ్గానిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులను పాకిస్థాన్ ఉసిగొల్పనుందని నిఘా సంస్థలు ఇటీవల హెచ్చరించాయి. ఆ ఉగ్రమూకలు కశ్మీర్‌లోకి చొరబడటానికి ఇప్పటికే పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని టెర్రర్‌ లాంచ్ ప్యాడ్స్‌ వద్ద సిద్ధంగా ఉన్నారని తెలిపాయి.

మరిన్ని వార్తలు