యువతతోనే అద్భుతాలు

20 Jan, 2019 05:01 IST|Sakshi
తెలంగాణ జాగృతి అంతర్జాతీయ యువ నేతృత్వ సదస్సుకు వచ్చిన విదేశీ ప్రతినిధులతో ఎంపీ కవిత. సదస్సులో మాట్లాడుతున్న అన్నా హజారే

తెలంగాణ జాగృతి అంతర్జాతీయ సదస్సులో అన్నా హజారే పిలుపు

సాక్షి, హైదరాబాద్‌: సరైనమార్గనిర్దేశనం ద్వారా యువతతో అద్భుతాలు సృష్టించొచ్చని గాంధేయవాది, పద్మభూషణ్‌ అన్నా హజారే సూచించారు. ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం, దేశమే మీకుటుంబం అన్న భావనతో యువత పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అలా నమ్మి ఆచరిస్తున్న ఫలితంగానే ఒకప్పుడు కరువు కాటకాలకు నిలయమైన రాలేగావ్‌ సిద్ధీ ఈ రోజు పచ్చదనంతో కళకళలాడుతోందని చెప్పారు. తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు నిజామాబాద్‌ పార్లమెంటు సభ్యులు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైన ‘తెలంగాణ జాగృతి అంతర్జాతీయ యువ నేతృత్వ సదస్సు’కు అన్నా హజారే ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.

ఈ సదస్సుకు 110 దేశాల నుంచి 550 మంది యువ ప్రతినిధులు హాజరు కాగా, సుస్థిరాభివృద్ధికి, సృజనాత్మకతలకు గాంధేయ మార్గం అన్న ఇతివృత్తంపై ఈ సదస్సులో చర్చోపచర్చలు ఉంటాయి. సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా హజారే మాట్లాడుతూ.. యువత గ్రామాలకు సేవ చేయడం మొదలుపెడితే మనదేశం అమెరికా, రష్యాలను అధిగమించి ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంటుందన్నారు. ఏదో సాధించాలన్న తపన యువతలో ఉన్నప్పటికీ తగిన మార్గనిర్దేశనం లేకపోవడంతో కొంతమంది పెడదారి పడుతున్నారన్నారు. ఒక లక్ష్యంతో ప్రణాళికబద్ధంగా కృషి చేసి యువత తమ ఆకాంక్షలను నెరవేర్చుకోవాలని పిలుపునిచ్చారు.

గాంధీ రచనలతో మార్పు..
యువకుడిగా ఉన్నప్పుడు ఈ జీవితం ఎందుకు? అన్న ప్రశ్న తనకూ వచ్చిందని..పాతికేళ్ల వయసులో ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో గాంధీజీ రచనలతో ఏర్పడిన పరిచయం తన జీవితాన్ని మార్చేసిందని హజారే గుర్తు చేసుకున్నారు. మానవ జీవిత పరమార్థం సేవేనని నిర్ణయించుకుని స్వగ్రామమైన రాలేగావ్‌సిద్ధీతో కొత్త ప్రస్థానం మొదలుపెట్టానని వివరించారు. తిండికి గతిలేని స్థితి నుంచి రోజుకు 150 ట్రక్కుల కూరగాయలు ఎగుమతి చేసే స్థితికి రాలేగావ్‌సిద్ధీ చేరుకుందన్నారు.

ప్రకృతిని కాపాడుకుంటూనే రాలేగావ్‌సిద్ధీని అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలని..అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని నాశనం చేయడం తగదని హితవు పలికారు. పెళ్లి విషయంలో తనను అనుకరించాల్సిన అవసరం లేదని అన్నా హజారే చలోక్తి విసిరారు. ‘‘పెళ్లి చేసుకోండి. పిల్లల్ని కనండి. అలాగని అదే మీ కుటుంబం అనుకోవద్ద’’ని చెప్పారు. అభివృద్ధి, అవినీతి రెండు ఒకే నాణేనికి రెండు పార్శా్వలని, అవినీతి అంతానికి తాను చేసిన ఉద్యమం ఫలితంగా సమాచార హక్కు చట్టం వచ్చిందని గుర్తు చేశారు.

యువతకు తగిన విధానాలు అవసరం: కవిత
యువతకు, సమాజ శ్రేయస్సుకు, సమస్యల పరిష్కారానికి మనదేశంతో పాటుగా ఇతర దేశాల్లోనూ తగిన విధానాలు లేవని ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో పేదరికం, ఆకలి నిర్మూలన, వాతావరణ పరిరక్షణ, స్వచ్ఛమైన గాలి వంటివి అనేకం ఉన్నాయన్నారు. ఈ సమస్యలన్నీ మనుషులుగా మనం సృష్టించినవేనన్నారు. ప్రతీరోజూ 22 వేల మం ది పిల్లలు బాల్యంలోనే తనువు చాలిస్తుండటం, 80 కోట్ల మంది ఆకలితో నిద్రపోతుండటం, గాలి కాలుష్యం తనను ఎంతో కలచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

యువశక్తి సాయంతో ఈ సమస్యలకు పరిష్కారాలు కనుక్కునేందుకు ఈ సదస్సు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యువత ఈ సమస్యలను సరి కొత్త దృక్కోణంతో చూడగలదని.. అదే స్థాయి లో పరిష్కారాలు కూడా చూపగలదన్నారు. సుస్థిర అభివృద్ధికి నమూనాగా నిలిచి న రాలేగావ్‌సిద్ధీని నేటికీ వందలాది మంది సందర్శిస్తున్నారంటే అది అన్నా హజారే కృషి ఫలితమేనన్నా రు. తమ హక్కులను సాధించుకునేందుకు.. సమస్యల పరిష్కారానికి ప్రపంచవ్యాప్తంగా యువత ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ దిశగా వేసిన తొలి అడుగుగా యువ నేతృత్వ సదస్సును పరిగణించాలన్నారు.

మరిన్ని వార్తలు