ఇకనైనా మీరే పన్ను కట్టండి

14 Sep, 2019 04:04 IST|Sakshi

సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సూచన

40 ఏళ్లుగా ముఖ్యమంత్రి, మంత్రుల పన్ను కడుతోన్న యూపీ సర్కార్‌

లక్నో: మంత్రులంతా ఎవరి ఆదాయ పన్నులు వారే చెల్లించుకోవాలని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సూచించారు. నాలుగు దశాబ్దాలుగా మంత్రుల ఆదాయపు పన్ను ప్రభుత్వం చెల్లిస్తున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. నాలుగు దశాబ్దాల కిందట ఏర్పాటైన ఓ చట్టం ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రులు, మంత్రులకు 40 ఏళ్లుగా ఆదాయపు పన్ను చెల్లించే అవసరం లేకుండా చేసింది. ఈ విషయం మీడియాకు తెలిసి విమర్శలపాలు కావడంతో సీఎం యోగి దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు. మంత్రుల పన్ను ప్రభుత్వమే చెల్లిస్తోందని కొందరు రాజకీయ నాయకులకు కూడా తెలియకపోవడం విశేషం. 1981లో వీపీ సింగ్‌ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శాసన సభకు ఎన్నికైన వారిలో ఎక్కువ మంది పేదలు ఉండడంతో, వారు చెల్లించాల్సిన ఇన్‌కం టాక్స్‌ ప్రభుత్వమే చెల్లించేలా చట్టం తెచ్చారు.

దీంతో ముఖ్యమంత్రికి, ఆయన ఆధ్వర్యంలోని మంత్రి వర్గానికి ఆదాయపు పన్ను చెల్లించే అవసరం లేకుండా పోయింది. అనంతరం వివిధ పార్టీలకు చెందిన 19 మంది ముఖ్యమంత్రులు, 1,000 మందికి పైగా మంత్రులు ప్రభుత్వంలో పని చేశారు. వీరందరి ఆదాయ పన్నును ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఇప్పటి యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వంలోనూ ఇదే తంతు కొనసాగుతుండడం గమనార్హం. వీపీ సింగ్‌ తర్వాత అనేక మంది ధనిక ముఖ్యమంత్రులు కూడా పని చేశారు. అందులో ఎన్నికల అఫిడవిట్లలో రూ. 111 కోట్ల ఆస్తిని చూపిన బీఎస్పీ అధినేత్రి మాయావతి, 37 కోట్ల ఆస్తిని చూపిన ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్, రూ. 95 లక్షల ఆస్తి చూపిన ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లు ఉన్నారు. ఆ చట్టం వచ్చిన అనంతరం జీతాలు పలు రెట్లు పెరిగాయని ఆయన పేర్కొన్నారు. యూపీ మాజీ ఆర్థిక మంత్రి లాల్జి వర్మ తనకు ఈ చట్టం గురించి తెలియదని చెప్పడం కొసమెరుపు.

మరిన్ని వార్తలు