'నా భార్యను రక్షించిన వాయుసేనకు వందనం'

7 Dec, 2015 15:51 IST|Sakshi
'నా భార్యను రక్షించిన వాయుసేనకు వందనం'

చెన్నై: ఆమె పేరు దీప్తి(28). తొమ్మిది నెలల గర్భిణీ. మరో వారం రోజుల్లోనో అంతకంటే ముందుగానో తల్లిగా మారబోతున్నాని ఆనందం.. ఇంతలో అకాల వర్షాలు.. ఇళ్లు మునిగిపోయేలా వచ్చిన వరదలు.. తల్లిగా మారబోతున్న ఆమహిళ మనసులో ప్రశాంతత దూరమై ఆందోళన అలుముకుంది. ఎందుకంటే అడుగుతీసి అడుగువేయలేని పరిస్థితి.. సర్వత్రా జలమయం. సాయం చేసేందుకు ఎవరూ రాలేని పరిస్థితి. వైద్యం కూడా అందుతుందో లేదో అని అనుమానం.

ఈ సమాచారం తెలుసుకున్న భారత ఆర్మీకి చెందిన హెలికాప్టర్ రానే వచ్చింది. ఆమెకు దన్నుగా నిలిచింది. ఇంటిపై భాగంలో తన రెక్కలు రెపరెపలాడిస్తూ తన ఒడిలో కూర్చోబెట్టుకుని సురక్షితంగా ఆస్పత్రికి చేర్చింది. డిసెంబర్ 2న ఈ దృశ్యం ఆవిష్కృతంగా కాగా ఇప్పుడు ఆమె పండంటి ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. తల్లి దీప్తితో సహా ఇద్దరు పిల్లలు చక్కటి ఆరోగ్యంతో ఉన్నారు. ఈ సందర్బంగా ఆమె భర్త కార్తిక్ వెల్చామీ తాను పడిన ఆందోళన, భయాన్ని మీడియాతో పంచుకున్నాడు.

చెన్నైకి సమీపంలోని వర్ష ప్రభావానికి గురైన గిండీకి సమీపంలోని రామపురం ప్రాంతం తమదని, నిండు గర్భవతి అయిన తన భార్యను ఏ విధంగా రక్షించుకోవాలా అని ఎంతో భయానికి లోనయ్యానని, ఆ సమయంలో తాను బెంగళూరులో ఉన్నానని, డిసెంబర్ 2న ఆమెను హెలికాప్టర్ ద్వారా సురక్షితంగా ఆస్పత్రికి తరలించడంతో డిసెంబర్ 4న ప్రసవించిందని చెప్పాడు. ఈ సందర్భంగా ఎంతో భావోద్వేగానికి లోనవుతూ భారత వాయు సేనకు కార్తిక్ ధన్యవాదాలు తెలిపాడు. తమను ఎవరూ కాపాడలేరనుకున్న సమయంలోనే వాయుసేన రక్షించిందని చెప్పారు.

మరిన్ని వార్తలు