ఆరెస్సెస్‌ చీఫ్‌తో అమిత్‌ షా భేటీ

2 Nov, 2018 15:59 IST|Sakshi

సాక్షి, ముంబై : అయోధ్యలో రామమందిర నిర్మాణంపై సంఘ్‌ పరివార్‌ నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌తో శుక్రవారం భేటీ అయ్యారు. మందిర నిర్మాణంపై వీరిరువురూ సంప్రదింపులు జరిపారు. మోహన్‌ భగవత్‌తో పాటు పలువురు సంఘ్‌ నేతలతోనూ అమిత్‌ షా సమాలోచనలు చేపట్టారు. కాగా, సుప్రీం కోర్టులో రామమందిర అంశం పెండింగ్‌లో ఉన్నందున ఆర్డినెన్స్‌ ద్వారా మందిర నిర్మాణానికి పూనుకోవాలని ఆరెస్సెస్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

సర్వోన్నత న్యాయస్ధానం మందిర్‌ వ్యవహారంలో సత్వర నిర్ణయం తీసుకోవాలని, ఈ క్రమంలో ఇబ్బందులు ఎదురైతే ప్రభుత్వం చట్టం తీసుకువచ్చి రామజన్మభూమి స్ధలంలో మందిర నిర్మాణం చేపట్టాలని ఆరెస్సెస్‌ ప్రతనిధి అరుణ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. గుజరాత్‌లో సోమనాధ్‌ ఆలయాన్ని సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ పునర్నిర్మించిన తరహాలో మందిర నిర్మాణానికి భూమిని సేకరించేందుకు ప్రభుత్వం చట్టం తీసుకురావాలని ఆరెస్సెస్‌ పట్టుబడుతోంది.

బీజేపీ మిత్రపక్షం శివసేన సైతం ఇదే తరహా డిమాండ్లను ప్రభ్తువం ముందుంచింది. రామ మందిర నిర్మాణం ఆవశ్యకతను ప్రధాని నరేంద్ర మోదీకి గుర్తుచేసేందుకు శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ థాకరే ఈనెల 25న అయోధ్య యాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు