ఇది ‘సారీ’ల మాసం

18 Apr, 2018 08:10 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘ఏప్రిల్‌ ఈజ్‌ ది క్రుయలెస్ట్‌ మంత్‌’ టీఎస్‌ ఇలియట్‌ రాసిన ‘ది వేస్ట్‌ ల్యాండ్‌’ కవిత్వంలో మొదటి వ్యాక్యం ఇది. ఆ వ్యాక్యం వెనక ఆయన ఉద్దేశం ఏమిటో గుర్తు లేదుగానీ ఈసారి ఎక్కువ మంది తప్పనిసరి పరిస్థితుల్లో ‘సారీ’లు చెబుతున్నందున నిజంగా ‘ఏప్రిల్‌ ఈజ్‌ ది క్రుయలెస్ట్‌ మంత్‌’యే. సారీ చెప్పడం అంత సులభమైన విషయం కాదని, సారీ చెప్పడం చాలా కష్టమని మానసిక శాస్త్రవేత్తలు చెప్పడమే కాకుండా ‘సారీ సీమ్స్‌ టు బీ ది హార్డెస్ట్‌ వర్డ్‌’ అంటూ 1970లో ఎల్టాన్‌ జాన్‌ పాటగా పాడారు.

భారత దేశంలో ఏప్రిల్‌ రెండవ తేదీన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీకి ‘సారీ’ చెప్పారు. ఆయన సారీల పర్వంలో అది మూడవది. అంతకుముందు ఆయన పంజాబ్‌ మాజీ మంత్రి బిక్రమ్‌ సింగ్‌ మజీథియా, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కారీలకు సారీ చెప్పారు. ఏప్రిల్‌ నాలుగవ తేదీన ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ విలేఖరులతో మాట్లాడుతూ ఫేస్‌బుక్‌ నకిలీ వార్తలు, తప్పుడు వార్తలు, విద్వేష ప్రసంగాలు వచ్చినందుకు, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగినందుకు ‘సారీ’ చెప్పుకున్నారు. ఆ తర్వాత మరోసారి ఏప్రిల్‌ పదవ తేదీన అమెరికా సెనేట్‌కు సారీ చెప్పారు. ఫేస్‌బుక్‌ను ప్రారంభించిందీ తానని, అందులోని వ్యవహారాలకు తాను బాధ్యుడినని, జరిగిన పొరపాటుకు చింతిస్తున్నానని, అందుకు సారీ అని చెప్పారు.

రాజకీయాల్లో నిర్లక్ష్యానికి గురైన దళిత సోదర సోదరీ మణులకు అమిత్‌ షా క్షమాపణలు చెప్పారు. ఇంజన్‌ లేకుండా ప్రయాణికులు రైలు పరుగెత్తినందుకు భారతీయ రైల్వే ప్రయాణికులకు సారీ చెప్పింది. ఏ రోగికి తప్పుడు ఆపరేషన్‌ చేసినందుకు ఢిల్లీలోని ఏయిమ్స్‌ సారీ చెప్పింది. గురుపూరబ్‌ శుభాకాంక్షలను ఏడు నెలలు ముందుగా చెప్పినందుకు ఉత్తరప్రదేశ్‌ నేతలు క్షమాపణలు చెప్పారు. ఎన్నికల్లో కేంబ్రిడ్జి అనలిటికా సేవలను వినియోగించుకున్నందుకు రాహుల్‌ గాంధీ క్షమాపణలు చెప్పాలంటూ కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ డిమాండ్‌, సీబీఎస్‌ఈ ఫలితాలు లీకయినందుకు, బ్యాంకు కుంభకోణాలు పెరిగినందుకు, ఎస్సీ,ఎస్టీల చట్టాన్ని సడలించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ సారీ చెప్పాలంటూ రాహుల్‌ గాంధీ చేసిన డిమాండ్‌కు ఇంకా స్పందన రావాల్సి ఉంది.

ఇంకా క్విడ్‌ప్రో కేసులో ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈవో చందా కొచ్చార్, కథువా లాంటి దారుణ హత్యా, అత్యాచారాలు పెరిగినందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పదేళ్లలో కూడా హిందూ టెర్రరిస్టుల కేసుల్లో దోషులను నిరూపించలేకపోయిన నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ,  పడక సుఖం ఇస్తేనే పాత్రలిస్తామంటూ విలువల వలువలూడదీసిన తెలుగు సినీ పరిశ్రమ ‘సారీ’ చెప్పాల్సి ఉంది.

మరిన్ని వార్తలు